కరోనా నేపథ్యంలో బంతికి మెరుపు తెప్పించడానికి లాలాజలం వాడటాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిషేధించింది. దీనిపై ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్‌లీ స్పందించాడు. ఈ నిబంధనల్ని అమలు చేయడం చాలా కష్టతరమైన పని అని అంటున్నాడు. అనిల్ కుంబ్లే అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ఐసీసీ క్రికెట్ కమిటీ సమావేశంలో కొన్ని మార్గనిర్దేశకాలను విడుదల చేశారు. క్రికెటర్లు పాటించాల్సిన నియమాలతో పాటు బంతికి లాలాజలాన్ని రాయడానన్ని నిషేధిస్తూ కొత్త నిబంధనలను జారీ చేసింది ఐసీసీ.
"బౌలర్లు కొన్నేళ్లుగా పాటిస్తున్న బంతిని మెరుపు తెప్పించే టెక్నిక్‌లు.. ఇప్పటికిప్పుడు మానేయండి అంటే కుదురకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఉన్న అలవాటును ఎవరూ తొందరగా మానలేరు. అందువల్ల దానికి కొంత సమయం పట్టొచ్చు. ఏది ఏమైనా ఇదో గొప్ప నిర్ణయం. కాకపోతే అమలు చేయడమనేది కొంత కష్టతరం కావొచ్చు".
-బ్రెట్‌లీ, ఆస్ట్రేలియా మాజీ బౌలర్
బ్రెట్‌లీ వ్యాఖ్యలకు దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్ మద్దతిచ్చాడు. బౌలర్లే కాకుండా ఫీల్డర్స్ దీనికి బాగా అలవాటు పడ్డారని తెలిపాడు. ఫీల్డర్‌గా తాను బంతిని అందుకునే ముందు లాలాజలాన్ని అరచేతులకు రాసుకుంటానని వెల్లడించాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ కూడా తరచుగా లాలాజలాన్ని వాడే వాడని గుర్తుకు చేశాడు డుప్లెసిస్. ఈ విషయంపై టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. అలవాటు పడిన పనిని వదిలేయాలంటే కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చూడండి... 'టిక్‌టాక్‌లో డ్యూయెట్ చేద్దామా కోహ్లీ'