ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌కు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ విజృంభణ కారణంగా పలు రాష్ట్రాలు, ఈ మ్యాచ్‌లను నిర్వహించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా దిల్లీ ప్రభుత్వం.. ఐపీఎల్ మ్యాచ్‌లకు నో చెప్పింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కారణంగా, నిర్వహించడం వీలు కాదంటూ తేల్చి చెప్పింది.
ఇప్పటికే దిల్లీ ప్రభుత్వం అక్కడ పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లను ఈనెల 31 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే క్రీడలకు సంబంధించిన పలు టోర్నీలు నిర్వహించడం వీలు కాదని చెప్పింది.
"ఐపీఎల్ లాగా భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే టోర్నీలను రద్దు చేస్తున్నాం. కరోనా వైరస్ విచ్ఛిన్నతను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం"
-మనీశ్ సిసోడియా, దిల్లీ ఉప ముఖ్యమంత్రి
కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ జరిగేది లేనిది అనుమానంగా మారింది. ఈ విషయంపై చర్చించడానికి బీసీసీఐ.. ఆయా ఫ్రాంఛైజీలతో సమావేశం కానుంది. అనంతరం ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.