టీమిండియా సెలక్టర్ల పదవి ఎంపిక ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని తెలిపాడు క్రికెట్ పాలక మండలి (సీఏసీ) సభ్యుడు మదన్ లాల్. సెలక్టర్ల పదవికి దరఖాస్తు చేసిన వారిలో షార్ట్‌లిస్టును రూపొందిస్తామని చెప్పాడు.
"సెలక్టర్ల పదవికి దరఖాస్తు చేసిన వారిలో షార్ట్‌లిస్ట్‌ను తయారుచేస్తాం. ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్‌తో కలిసి చర్చించి ఇంటర్వ్యూలకు అర్హత సాధించే వారి జాబితాను సిద్ధం చేస్తాం. మార్చి 1 లేదా 2వ తేదీలోపు కొత్త సెలక్టర్ల నియామకం పూర్తిచేస్తాం. న్యూజిలాండ్ పర్యటన ముగించి టీమిండియా స్వదేశానికి తిరిగి వచ్చేలోపే ఈ ప్రక్రియ ముగుస్తుంది. కొత్తగా నియామకమైన సెలక్టర్లే మార్చి 12న ఆరంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేస్తారు."
-మదన్‌లాల్, సీఏసీ సభ్యుడు
ఇటీవల భారత మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, మదన్ లాల్, సులక్షణ నాయక్ సీఏసీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. జాతీయ సెలక్టర్లను ఎంపిక చేసే బాధ్యత వీరిదే. పదవీ కాలం ముగిసిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడా స్థానాలను వీరు భర్తీ చేస్తారు. మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్, నయన్ మోంగియా, చేతన్ చౌహాన్, నిఖిల్ చోప్రా, అభయ్ కురువిల్లా సెలక్టర్ల రేసులో పోటీపడుతున్నారు. వీరిలో వెంకటేశ్ ప్రసాద్ (33 టెస్టులు), అగార్కర్ (26 టెస్టులు)కు టెస్టులు ఎక్కువ ఆడిన అనుభవం ఉంది.