పురుషాధిక్య బీసీసీఐలో ఓ మహిళా క్రికెటర్‌కు ప్రాతినిధ్యం దక్కుతుందని కలలోనైనా ఊహించలేదన్నారు భారత మాజీ క్రికెటర్ శాంత రంగస్వామి. జస్టిస్ ఆర్.ఎం.లోధా సిఫార్సుల వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
అత్యున్నత పదవిలో...
బీసీసీఐ తొమ్మిది మంది సభ్యుల అత్యున్నత మండలిలో శాంత రంగస్వామికి దాదాపు చోటు ఖాయమైంది. భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) ఎన్నికల్లో ఆమె పోటీ లేకుండా ఎంపికకానున్నారు. అక్కడి నుంచి బీసీసీఐ అత్యున్నత మండలిలో ప్రాతినిధ్యం వహించనున్నారు.
" బోర్డులో నేను భాగమవుతానని కలలోనైనా అనుకోలేదు. లోధా సిఫార్సులను కొందరు తిట్టుకోవచ్చు. కానీ దాని వల్లే బోర్డులో ఇప్పుడు మా గళం వినిపించనుంది. ఇది పురుషుల కోటలో తుపాను లాంటిది"
-- శాంత రంగస్వామి, మాజీ క్రికెటర్
అత్యున్నత మండలి ఏర్పాటు కాగానే మహిళల క్రికెట్ అభివృద్ధి కోసం ఐదు అంశాలను బోర్డు ముందు ఉంచనున్నారు శాంత రంగస్వామి. బీసీసీఐ మద్దతుతో ఇప్పటికే మహిళల క్రికెట్.. ఓ కెరీర్ అవకాశంగా మారిందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహిళా క్రికెటర్లకు, కనీసం రంజీ పురుష క్రికెటర్లకు ఇచ్చే స్థాయిలోనైనా పింఛను ఇవ్వాలని కోరనున్నారు. మహిళా క్రికెట్ కోచ్‌ల పరిస్థితి మెరుగుపర్చడం, బాలికల అండర్-16 టోర్నీలు నిర్వహణ వంటి విషయాలపై బోర్డుకు తన గళం వినిపించనున్నారు.
బీసీసీఐ గుర్తింపునకు నోచుకోని రోజుల్లో భారత మహిళా క్రికెట్ జట్టుకు ఈమె సారథ్యం వహించారు. బోర్డు నుంచి జీవితకాల పురస్కారం అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గానూ పేరు తెచ్చుకున్నారు.