చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోనీపై సీఈఓ కాశీ విశ్వనాథన్ నమ్మకముందని అన్నారు. ప్రస్తుతం కఠిన పరిస్థితులున్నా సరే జట్టును మహీ సురక్షితంగా నడిపించగలడని చెప్పారు. అతడి నాయకత్వంలో ఆటగాళ్లు మరింత మెరుగ్గా ఆడతారని ధీమా వ్యక్తం చేశారు.
"ప్రస్తుతం సీఎస్కే మంచి ఫామ్‌లో ఉంది. దాని కోసం మనం చింతించాల్సిన అవసరం లేదు. కొన్ని కఠిన క్షణాలలోనూ జట్టును నడపగల సత్తా ఉన్న కెప్టెన్ మనకు ఉన్నాడు. అతడు జట్టును సురక్షితంగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది. శుక్రవారం నుంచి ఆటగాళ్లు ప్రాక్టీసు మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొన్నారు. వారందరికీ ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ నిర్వహించి సూచనలు ఇస్తున్నాడు ధోనీ. ప్రస్తుత పరిస్థితుల నుంచి జట్టు బయటపడిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా. టోర్నీలో రాణిస్తుందని ధీమాగా ఉన్నా"
- కాశీ విశ్వనాథన్, చెన్నై సూపర్‌కింగ్స్ సీఈఓ
ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆది నుంచే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తొలుత ఇద్దరు ఆటగాళ్లతో పాటు 11 మంది సిబ్బందికి కరోనా సోకడం సహా సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లాంటి స్టార్స్ టోర్నీ నుంచి వైదొలగడం నిరాశకు గురి చేసింది.
యూఏఈ చేరిన దాదాపు రెండు వారాల తర్వాత శుక్రవారం నుంచి ప్రాక్టీసు మొదలుపెట్టింది సీఎస్కే. ధోనీతో పాటు మిగిలిన ఆటగాళ్లకు పాల్గొన్నారు. ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది ధోనీసేన.