టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత గౌరవంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సిందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. రిటైర్మెంట్ విషయంలో అతనలా ఎందుకు జాప్యం చేస్తున్నాడో తనకు ఇప్పటికీ అర్థమవ్వట్లేదని చెప్పాడు.
"తనకు చేతనైనంత మేరకు ధోనీ టీమ్‌ఇండియాకు సేవ చేశాడు. అతను గర్వంగా ఆటకు వీడ్కోలు పలకాలి. ఈ విషయంలో అతనెందుకు జాప్యం చేస్తున్నాడో నాకు అర్థంకావడం లేదు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత ఆట నుంచి తప్పుకోవాల్సింది."
-అక్తర్, పాక్ మాజీ పేసర్
ఒకవేళ ధోనీ స్థానంలో తానుంటే అలాగే చేసేవాడినని చెప్పాడు. 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత తాను మరో మూడు, నాలుగేళ్లు టీ20 క్రికెట్ ఆడేవాడినని, అయితే తన సామర్థ్యం తగ్గినందున అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించానని స్పష్టంచేశాడు. అయితే, ధోనీ టీమ్‌ఇండియాకు ఎంతో చేశాడని, ప్రపంచకప్‌లతో పాటు అద్భుత విజయాలెన్నో అందించాడని అక్తర్ గుర్తుచేశాడు. ఈ నేపథ్యంలో అతను ఘన వీడ్కోలుకు అర్హుడని, అతను రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అలాగే సెండాఫ్ ఇవ్వాలన్నాడు.
అనంతరం టీమ్‌ఇండియా 2013 నుంచి ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోవడంపై స్పందిస్తూ.. కోహ్లీసేనకు మిడిల్ ఆర్డర్‌లో మ్యాచ్ విన్నర్లు లేరని విమర్శించాడు. అయితే, భారత్ ఐసీసీ కప్పులు గెలవకపోయినా బలమైన జట్టేనని ఒప్పుకున్నాడు.
"1998లో తాము భారత పర్యటనకు వచ్చినప్పుడు టాప్‌ఆర్డర్‌ను కూలదోస్తే మ్యాచ్‌పై పట్టుసాధించొచ్చని అనుకునేవాళ్లం. తర్వాత యువరాజ్, ధోనీల రాకతో టీమ్‌ఇండియా విజయాల్లో మార్పులొచ్చాయి. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో వన్డే, టెస్టు సిరీస్‌లు కోల్పోయినా ఇంకా అత్యుత్తమ జట్టే. ఈ ఏడాది చివర్లో కంగారూల గడ్డపై భారత్ మరోసారి ఆధిపత్యం చెలాయిస్తుందని అనుకుంటున్నా."
-అక్తర్, పాక్ మాజీ పేసర్
అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్-ఆసీస్ ఆ సిరీస్ జరగబోదని, అలాగే టీ20 ప్రపంచకప్ కూడా జరగదని తాను అనుకుంటున్నట్లు అక్తర్ తెలిపాడు.