మహేంద్రసింగ్ ధోనీ పేరు చెప్పగానే హెలికాప్టర్ షాట్లు గుర్తొస్తాయి! ఇప్పుడు ఆ పేరుతోనే చాక్లెట్లు రాబోతున్నాయి. ముంబయికి చెందిన 7ఇంక్‌బ్రూస్ అనే ఆహార అంకుర సంస్థ మహీ పేరిట ఈ చాక్లెట్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. తాజాగా ఈ కొత్త బ్రాండ్‌ను విడుదల చేశారు. ఈ కంపెనీలో ధోనీ కూడా భాగస్వామి కావడం విశేషం.
మోహిత్ భాగ్‌చంద్రానీ, అదిల్ మిస్త్రీ, కునాల్ పటేల్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ.. మహీ హెలికాప్టర్ షాట్‌తో పాటు అతడి జెర్సీ నంబర్ 7 స్ఫూర్తితో 'కాప్టర్-7' అనే పేరిట ఈ చాక్లెట్లను తయారు చేస్తోంది. ఇప్పటికే ఈ బ్రాండ్‌ను ముంబయి, గోవా, బెంగళూరులో ప్రారంభించారు. ధోనీ స్వస్థలం జార్ఖండ్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌లోనూ త్వరలో ఈ చాక్లెట్లు విడుదల కాబోతున్నాయి. ప్రముఖ వంటల నిపుణుడు డేవిడ్ బెలోతో కలిసి ఈ చాక్లెట్లను తయారు చేస్తున్నారు.