టీమ్ఇండియాపై తన అక్కసు వెల్లగక్కాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. టెస్టు క్రికెట్‌కు పనికిరాని పిచ్‌లను తయారు చేసే వెసులుబాటు భారత్ లాంటి దేశాలకు కల్పించినంత కాలం.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అసమర్థంగా కనిపిస్తుందని అన్నాడు. మొతేరా పిచ్‌పై జరిగిన డేనైట్ టెస్టులో భారత్‌ది అసలు గెలుపే కాదని విమర్శించాడు.
"భారత్ లాంటి శక్తిమంతమైన దేశాలకు ఇలాంటి(మొతేరా) పిచ్‌లను తయారు చేసుకునే వీలు కల్పించే కొద్దీ ఐసీసీ మరింత బలహీనంగా కనిపిస్తుంది. టీమ్ఇండియాకు నచ్చినట్టు చేసుకునే వెలుసుబాటు కల్పించడం వల్ల టెస్టు క్రికెట్‌పై దుష్ప్రభావం పడుతోంది. మూడో టెస్టు భారత్ గెలించింది. కానీ అది పెద్ద విజయం కాదు. ఈ మ్యాచ్‌లో అసలు విజేతలు లేరు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ కన్నా టీమ్ఇండియా సమర్థవంతమైన నైపుణ్యాలు ప్రదర్శించడం వాస్తవం."
-మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
క్రికెట్ మంచి కోసం మాజీ క్రికెటర్‌గా ఈ అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం, బాధ్యత ఉందని వాన్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి పిచ్‌ల వల్ల ఆటగాళ్ల కెరీర్లు దెబ్బతింటాయని, వారి ఉత్సాహాన్ని అవి నీరుగారుస్తాయని అన్నాడు.
మూడో టెస్టులో పిచ్ స్పిన్‌కు బాగా అనుకూలించిన వేళ ఇంగ్లాండ్‌పై 10 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే పిచ్‌ను స్పిన్‌కు అనుకూలంగా తయారు చేయడం పట్ల మాజీ క్రికెటర్లలో భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి.
రీఫండ్ కోరాలి..
రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసే పరిస్థితి తప్పాలంటే ప్రసారదారులు రీఫండ్ కోరాలని వాన్ భావించాడు. మూడో రోజుల పాటు ఎలాంటి ప్రసారాలు లేకున్నా నిర్వాహకులకు ప్రసారదారులు డబ్బులు చెల్లిస్తున్నారని, అలాంటి దుస్థితి పోవాలంటే వారు రీఫండ్ కోరాలని చెప్పాడు.
ఇంగ్లాండ్ రొటేషనల్ పాలిసీనీ వాన్ విమర్శించాడు. బెయిర్‌స్టోను తొలి రెండు టెస్టులకు పక్కనపెట్టి నేరుగా మూడో టెస్టులో ఆడించడాన్ని తప్పుబట్టాడు.
ఇదీ చూడండి: 'ఇంగ్లాండ్‌లో భారత్ సాకులు చెప్పదు'