గతేడాది పాకిస్థాన్ తరపున పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన మహమ్మద్ హఫీజ్.. దక్షిణాఫ్రికాతో టీ20లకు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం అబుదాబిలో టీ10 లీగ్ ఆడుతున్న అతను.. సఫారీతో సిరీస్ కోసం జట్టు కంటే రెండు రోజులు ఆలస్యంగా బయో సెక్యూర్ బబుల్‌లో చేరతానని చేసిన విజ్ఞప్తిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తిరస్కరించింది. దీంతో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న అతను లేకుండానే టీ20 జట్టును ఆదివారం పాక్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
ఈ సిరీస్‌లో ఫఖర్ జమాన్, వాహబ్ రియాజ్‌లపైనా వేటు పడింది. గాయంతో షాదాబ్ ఖాన్, వ్యక్తిగత కారణాలతో వసీమ్ సెలక్షన్స్‌కు అందుబాటులో లేకుండాపోయారు. జాఫర్, డానిష్ అజీజ్, జాహిద్, అమద్ మొదటిసారి జట్టుకు ఎంపికయ్యారు. ఈ జట్టుకు బాబర్ అజామ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఈ నెల 11న ఆరంభమయ్యే ఈ టీ20 సిరీస్ కోసం రెండు జట్లు 3వ తేదీనే బయో బబుల్‌లో అడుగుపెట్టనున్నాయి. సఫారీతో 4న ప్రారంభమయ్యే రెండో టెస్టు ఆడుతున్న ఆటగాళ్లు ఆ మ్యాచ్ ముగిశాక.. మిగతా ఆటగాళ్లతో చేరతారు. "ప్రతి ఆటగాడు ఈ నెల 3న బయో బబుల్‌లో అడుగుపెట్టాలి. ఒకవేళ ఎవరికైనా అది సాధ్యం కాకపోతే అతను సిరీస్‌కు అందుబాటులో లేనట్లే. అందుకే హఫీజ్‌ను ఎంపిక చేయలేదు" అని ఆ జట్టు ప్రధాన సెలక్టర్ మహమ్మద్ వసీమ్ పేర్కొన్నాడు.