వచ్చే నెలలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. పాక్ ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే ఇటీవలే వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్ నుంచి తప్పుకున్న పేసర్ మహమ్మద్ ఆమిర్.. తాజాగా జట్టులో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఆమిర్‌తో పాటు జట్టు నిర్వహకుల అభ్యర్థన మేరకు మహమ్మద్ ఇమ్రాన్నూ ఇంగ్లాండ్ పంపించేందుకు అంగీకరించినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రకటించింది.
ఈ పర్యటనలో భాగంగా ఆమిర్, ఇమ్రాన్ ఇద్దరూ సోమవారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇంగ్లాండ్ పర్యటనకు అర్హత సాధించాలంటే రెండు సార్లు కరోనా నెగిటివ్‌గా తేలాలి. ఫలితాలు నెగిటివ్‌గా వస్తే.. లాహోర్‌లో బయో సెక్యూర్ వాతావరణానికి తరలిస్తాం. అక్కడ బుధవారం రెండో దశలో పరీక్షలు నిర్వహిస్తాం.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.
ఆమిర్ జట్టులో చేరిన అనంతరం.. రిజర్వ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రోహైల్ నజీర్ తప్పుకుంటాడని పీసీబీ స్పష్టం చేసింది. మరోవైపు క్రికెటర్ షోయబ్ మాలిక్.. ఆగస్టు రెండో వారం వరకు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లలేడని పేర్కొంది.
"భారత్ అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై జులై 31 వరకు నిషేధం విధించిన నేపథ్యంలో.. ఆగస్టు రెండో వారం వరకు షోయబ్ ఇంగ్లాండ్ చేరుకోవడం కష్టమే. ఆగస్టు 28న మాంచెస్టర్‌లో ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో మాలిక్ జట్టులో చేరతాడు. ఆప్పుడు జట్టు యాజమాన్యం ఒక ఆటగాడిని తొలగిస్తుంది" అని పీసీబీ తెలిపింది.
ఈ పర్యటనలో ఇంగ్లాండ్-పాకిస్థాన్.. మూడు టెస్టులతో పాటు టీ20 సీరీస్‌లోనూ తలపడనున్నాయి. తొలి టెస్టు ఆగస్టు 5న ప్రారంభం కానుంది.