తనకు రావాల్సిన నష్టపరిహారం కోసం బీమా సంస్థతో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చేస్తున్న పోరాటం ముగిసినట్లే! ఆ సంస్థతో జరిగిన చర్చలు ఫలించాయని, అతనిడి డబ్బు చెల్లించేందుకు ఒప్పుకొందని సమాచారం.
"విక్టోరియన్ కౌంటీ కోర్టులో విచారణకు రెండు రోజుల ముందే సోమవారం రెండు వర్గాల మధ్య సంధి జరిగింది. ఈ సమస్యకు ఓ పరిష్కారం లభించింది. స్టార్క్‌కు ఎంత డబ్బు చెల్లించేది ఇప్పుడే బయటపెట్టలేదు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తాం" అని అక్కడి మీడియా తెలిపింది.
2018లో కుడికాలి పిక్కకు గాయం కావడం వల్ల స్టార్క్ ఆ ఏడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతను రూ.9.4 కోట్లు కోల్పోయాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోవడం వల్ల జట్టు అతనికి ఏం చెల్లించలేదు. గాయం కారణంగానే తాను ఆ డబ్బు పోగొట్టుకున్నానని, దానికి నష్టపరిహారంగా 1.53 మిలియన్ల అమెరికా డాలర్లు(రూ.11 కోట్లపైనే) చెల్లించాలని బీమా సంస్థను కోరాడు. అయితే ఆ గాయం కచ్చితమైన సమయంలో, అనుకోకుండా, అకస్మాత్తుగా జరిగినట్లు అతను నిరూపించాల్సి ఉంటుందని బీమా సంస్థ తెలపడం వల్ల స్టార్క్ గతేడాది ఏప్రిల్‌లో కోర్టులో దావా వేశాడు.
2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో స్టార్క్‌కు గాయమైందని అతని తరఫు న్యాయవాది కోర్టుకు ఆధారాలు సమర్పించాడు. అయితే అతనికి గాయమైనట్లు చెబుతున్న సమయం సరికాదని బీమా సంస్థ న్యాయవాది తెలిపాడు. చివరకు రెండు వర్గాలు రాజీకి వచ్చాయి.