టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్ అభిమానులు ట్విట్టర్ ఓపెన్ చేసి ట్రెడింగ్ చూడగానే ఒక్కసారిగా కలవరపడ్డారు. ఇప్పటికే ఈ ఏడాదిలో ఊహించని విపత్తులను ఎదుర్కొంటున్నాం. ఒకవైపు కరోనా వైరస్ దాడి చేస్తోంది. మరోవైపు తుపాన్ల విజృంభణ చూస్తున్నాం. కాకతాళీయంగా ట్విట్టర్ ట్రెండింగ్‌లో 'మిస్ యూ యువీ', 'రెస్ట్ ఇన్ పీస్' దర్శనమివ్వగా అంతా ఉలిక్కిపడ్డారు.
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యమవ్వని ఘనతలను అందుకున్నాడు యువీ. దాదాపుగా అన్ని ట్రోఫీలను ముద్దాడాడు. అండర్-19, వన్డే, టీ20 ప్రపంచకప్‌లను ఎత్తుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కలలనూ సాకారం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో రెండుసార్లు ట్రోఫీని స్పర్శించాడు. కొన్నాళ్ల క్రితమే టీ10 కప్‌నూ సొంతం చేసుకున్నాడు. ఇక ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు, మెగా టోర్నీల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ల వంటి పురస్కారాలెన్నో సొంతం చేసుకున్నాడు.
కల తీరకుండానే క్రికెట్‌కు వీడ్కోలు..
క్యాన్సర్‌పై విజయం సాధించి అందరికీ ప్రేరణగా నిలిచాడు. అదే మహమ్మారితో బాధపడుతున్న చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా సాయం అందిస్తున్నాడు. కెరీర్‌లో చివరిసారిగా 2019 వన్డే ప్రపంచకప్ ఆడదామని శ్రమించాడు. అప్పటికే రెండేళ్లుగా జట్టుకు దూరమవ్వడం వల్ల మెగాటోర్నీకి ఎంపికవ్వలేదు. అందుకే చివరి మ్యాచ్ ఆడకుండానే గతేడాది ఇదే రోజు (జూన్ 10)న యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ సహా పోటీ తీవ్రంగా ఉండే టోర్నీలేవీ ఆడనని వెల్లడించాడు. అయితే సరదా క్రికెట్ మాత్రం ఆడతానని పేర్కొన్నాడు.
ఆ ఎమ్మెల్యేకు సంతాపంతో..
అందుకే గతేడాది వీడ్కోలును స్మరిస్తూ అభిమానులు 'మిస్ యూ యువీ' ట్యాగ్‌తో అతడిని తలుచుకుంటున్నారు. ఆరు సిక్సర్లు, ప్రపంచకప్‌లు, ఇంకా మరెన్నో రికార్డులను గుర్తుచేసుకుంటున్నారు. తమిళనాడు ఎమ్మెల్యే జే అన్బళగన్ (62) కొవిడ్ కారణంగా ఇవాళ మృతిచెందారు. యాదృచ్ఛికంగా ఆయన జన్మదినమూ ఈ రోజే కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన అభిమానులు 'రెస్ట్ ఇన్ పీస్' ట్యాగ్‌లైన్‌తో ట్వీట్లు చేస్తున్నారు. ఈ రెండు ట్యాగ్‌లైన్లు ఒకేసారి ట్రెండ్ అవ్వడం, 'మిస్ యూ యువీ' కిందే 'రెస్ట్ ఇన్ పీస్' ఉన్నందున ట్విట్టర్లో కలవరం మొదలైంది. తాము ఎంతో భయపడ్డామని చాలా మంది ట్వీట్ చేశారు. ఇదీ యువీ అభిమానుల ఆందోళనకు కారణమైన రెండు ట్యాగ్‌లైన్ల సంగతి.
ఇదీ చూడండి:ఈ ఏడాది టెన్నిస్‌కు ఫెదరర్ దూరం