పాక్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ సహా చీఫ్ సెలక్టర్ పేరును నేడు వెల్లడించనుంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీబీసీ). ఆ దేశ మాజీ క్రికెటర్ మిస్బావుల్ హక్ ఈ రేసులో ముందంజలో ఉన్నాడు. బౌలింగ్ కోచ్ పదవికి వకార్ యూనిస్ పోటీపడుతున్నాడు.
మిస్బా ఎంపికకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి ఎంపిక తర్వాత సహాయక బృందంపై స్పష్టత ఇవ్వనుంది పీసీబీ. ఈ బాధ్యతలు స్వీకరించేవారు 2023 ప్రపంచకప్ వరకు జట్టు పర్యవేక్షణ చూడనున్నారు.
2010లో స్పాట్ ఫిక్సింగ్ వివాదంతో గాడి తప్పిన పాకిస్థాన్ జట్టును కెప్టెన్‌గా మిస్బావుల్ హక్ చక్కదిద్దాడు. 45 ఏళ్ల ఈ క్రికెటర్‌కు కోచ్‌గా బాధ్యతలు అప్పగించి.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ సమయానికి యువజట్టులో నిలకడ తీసుకురావాలని యోచిస్తోంది పీసీబీ. పాకిస్థాన్ తరఫున 75 టెస్టులు, 162 వన్డేలు ఆడాడు మిస్బావుల్.
లంకతో సిరీస్...
శ్రీలంకతో స్వదేశంలో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది పాకిస్థాన్. సెప్టెంబర్ 27 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్ ముందు జట్టులోని ఆటగాళ్లంతా సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభంకానున్న 'ఖైద్ ఈ అజమ్ ట్రోఫీ'లో ఆడాల్సి ఉంది.
ప్రపంచకప్ తర్వాత వేటు..
ప్రపంచకప్‌లో పాక్ జట్టు పేలవ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ... కోచ్ సహా పలు పదవుల్లో కొత్తవారిని నియమించాలని నిర్ణయం తీసుకుంది. ప్రధాన కోచ్ ఆర్థర్, బౌలింగ్ కోచ్ అజహర్ మొహ్మద్, బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లావర్ల కాంట్రాక్టులను పునరుద్ధరించలేదు. ఈ ముగ్గురూ 3 ఏళ్లు పాక్ జాతీయ జట్టుకు సేవలందించారు.
ఇదీ చదవండి...టీ20లకు ప్రముఖ క్రికెటర్ మిథాలీ వీడ్కోలు