ఇంగ్లాండ్‌తో ఈ నెల 23న ప్రారంభమవనున్న వన్డే సిరీస్ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇటీవలే టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్‌కు వన్డేల్లోనూ అవకాశం కల్పించింది. అలాగే టీ20ల్లో చాలాకాలంగా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న కృనాల్ పాండ్యాతో పాటు ఇప్పటివరకు జాతీయ జట్టుకు ఆడని ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో అసలు వీరిని తీసుకోవడానికి గల కారణాలను తెలుసుకుందాం.
కృనాల్ పాండ్యా
29 ఏళ్ల కృనాల్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా ఇప్పటికే టీ20ల్లో జట్టుకు సేవలందిస్తున్నాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించగలడు. ఇంగ్లాండ్ పేస్ దళానికి చివర్లో తన బ్యాటింగ్ మెరుపులతో కృనాల్ చెక్ పెట్టగలడని యాజమాన్యం భావిస్తోంది. అలాగే స్పిన్ అంటే ఆందోళన వ్యక్తం చేసే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు ఈ ఎడమచేతి స్పిన్నర్ మరో పరీక్షగా మారే అవకాశం ఉంది. టెస్టుల్లో ఎడమచేతి స్పిన్నర్ అక్షర్ పటేల్ వారిని ఎంతగా ఇబ్బందిపెట్టాడో తెలిసిందే. ఇప్పుడు కృనాల్ కూడా అలాంటి ప్రదర్శనే చేయగలడని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. టీ20 ప్రపంచకప్ దగ్గర పడుతోన్న క్రమంలో హార్దిక్ పాండ్యాకు కొంత విశ్రాంతినిచ్చే అవకాశమూ లేకపోలేదు. దీంతో కృనాల్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలనేది బోర్డు ముందున్న మరో ఆలోచన. ఈ ఏడాదే వెన్నునొప్పికి చికిత్స తీసుకున్న హార్దిక్‌కు మరో గాయం కాకూడదని అనుకుంటున్నారు. దీంతో కృనాల్ వారికి మంచి ఆల్‌రౌండర్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడని విశ్లేషకుల అంచనా.
సూర్యకుమార్ యాదవ్
గత రెండేళ్లుగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు కీ ప్లేయర్‌గా మారాడు. 2019, 2020 ఐపీఎల్లో ముంబయి టైటిల్ గెలవడంలో సూర్య బ్యాటింగ్ మెరుపులూ ఓ కారణం. ఇండియా మిస్టర్ 360గా పేరుపొందిన ఇతడు మైదానంలో నలువైపులా బంతిని బాదగలడు. 2010 రంజీ ట్రోఫీలో జట్టు తరఫున ఎక్కువ పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు సూర్య. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ, దేవదర్ ట్రోఫీ, ఐపీఎల్లో సత్తాచాటి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
![Suryakumar Yadav](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/surya_1903newsroom_1616142127_936.jpg)
ప్రసిద్ధ్ కృష్ణ
2015లో బంగ్లాదేశ్-ఏతో జరిగిన మ్యాచ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు పొడగరి పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ. పిచ్‌పై బౌన్స్‌ను రాబట్టడంలో ఇతడు దిట్ట. కెరీర్ ప్రారంభంలో చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో మెళకువలు నేర్చుకున్నాడు. తర్వాత ఆస్ట్రేలియా దిగ్గజం మెక్‌గ్రాత్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు. కర్ణాటక తరఫున వివిధ టోర్నీల్లో ఆడాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన కృష్ణ 18 వికెట్లు తీసుకున్నాడు. పరిమిత ఓవర్ల టీమ్ఇండియా పేస్ బౌలింగ్ ఇప్పుడిప్పుడే బలమవుతోంది. ఈ నేపథ్యంలో ఇతడు విజయవంతమైతే భవిష్యత్‌లో అది మరింత దృఢంగా మారే అవకాశం ఉంది.
![Prasidh Krishna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/prasidh_1903newsroom_1616142127_963.jpg)