రాజస్థాన్ రాయల్స్ , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో అశ్విన్.. రాజస్థాన్ ఆటగాడు బట్లర్‌ను మన్కడింగ్ విధానంలో ఔట్ చేయడం వివాదాస్పదమైంది. అశ్విన్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని అభిమానులు, మాజీ క్రికెటర్లు అతనిపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంసీసీ ఆ నిబంధనలపై వివరణ ఇచ్చింది.
మన్కడింగ్ విషయంలో అశ్విన్ ఏమాత్రం తప్పుచేయలేదని, అతడు నిబంధనల మేరకే నడుచుకున్నాడని స్పష్టం చేసింది ఎంసీసీ. మన్కడింగ్ "నిబంధన 41.16 "ఉండాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణిస్తూ ప్రకటన జారీ చేసింది.
నిబంధన 41.16 ఏం చెప్తోంది...?
" ఈ నిబంధన చాలా ముఖ్యమైంది. ఇదే లేకపోతే నాన్ స్ట్రైకర్ బ్యాట్స్‌మెన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. బౌలర్ బంతి వేయకుండానే పిచ్ సగం వరకు వెళ్లిపోతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ నిబంధన కచ్చితంగా అవసరం. బౌలర్ బ్యాట్స్‌మన్‌ను హెచ్చరించాలనే విషయంలో నిబంధనేమీ లేదు. ఇది క్రీడాస్ఫూర్తికి వ్యతిరేకమూ కాదు. బౌలర్ బంతి వేయకుండానే నాన్‌స్ట్రైకర్ క్రీజు దాటితేనే రనౌట్ అవుతారు. ఒక వేళ అశ్విన్ కావాలనే బంతి ఆలస్యంగా వేసి ఔట్ చేస్తే అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. కానీ అశ్విన్ అలా చేయలేదని వివరణ ఇచ్చుకున్నాడు. మూడో అంపైర్ కూడా నిబంధనల ప్రకారమే ఔట్ ఇచ్చాడు. నాన్‌స్ట్రైకర్ బ్యాట్స్‌మెన్ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. బౌలర్లు కూడా నిబంధనలకు లోబడి నిర్దిష్ట సమయంలోనే బౌలింగ్ చేయాలి" అంటూ నిబంధన 41.16 పై వివరణ ఇచ్చింది మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్.