బ్యాట్స్‌మెన్ చివరి బంతికి బౌండరీ బాది జట్టును గెలిపిస్తే ఆ కిక్కే వేరు. కీపర్ ఆఖరి బంతికి స్టంప్ చేసి మ్యాచ్ ముగిస్తే ఆ ఆనందానికి హద్దుండదు. మరి కెరీర్ ఆఖరి మ్యాచ్‌లో ఆఖరి బంతికి వికెట్ తీస్తే బౌలర్‌కు ఎంత సంతోషం ఉంటుందో కదా! 15 ఏళ్ల క్రితం బంతి పట్టిన మలింగ... పరిమిత ఓవర్ల క్రికెట్లో వీడ్కోలు మ్యాచ్ చివరి బంతికి వికెట్ తీశాడు. శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ వన్డే కెరీర్‌ను... బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన మొదటి వన్డేతో ముగించాడు.
ఆఖరి వికెట్...
మ్యాచ్‌లో 42వ ఓవర్ నాలుగో బంతికి వికెట్ తీశాడు మలింగ. ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను క్యాచ్ ఔట్ చేసి పెవిలియన్ చేర్చాడు. ఇక్కడే బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. వన్డే కెరీర్ చివరి బంతికి వికెట్ తీసి ముగింపు పలికాడీ యార్కర్ స్పెషలిస్ట్.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో... కుశాల్ పెరీరా (111) సెంచరీ బాదాడు. ఫలితంగా లంక 8 వికెట్లకు 314 పరుగులు చేసింది. మాథ్యూస్ (48), కుశాల్ మెండిస్ (43) రాణించారు. బౌలింగ్‌లో 38 పరుగులిచ్చి 3 వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు మలింగ . అతడికి తోడుగా ప్రదీప్ (3/51) విజృంభించడం వల్ల ఛేదనలో బంగ్లా 41.4 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. ముష్ఫికర్ 67, షబ్బీర్ 60 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో విజయం సాధించి మలింగకు వీడ్కోలు పలికింది లంక క్రికెట్ జట్టు.
15 ఏళ్ల కెరీర్లో 226 వన్డేలు ఆడి 338 వికెట్లు పడగొట్టాడీ 35 ఏళ్ల బౌలర్. 2011లో టెస్టులకు గుడ్‌బై చెప్పిన మలింగ... టీ20 క్రికెట్లో మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్నాడు.