శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం తన చివరి వన్డే ఆడనున్నాడు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇది ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు.
బంగ్లాదేశ్ వన్డే సిరీస్ మలింగకు చివరిదని ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ కరుణరత్నే తెలిపాడు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు మలింగానే స్వయంగా వెల్లడించాడు.
"పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం. నాకు సంతోషంగా ఉంది. యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశమిచ్చి వచ్చే ప్రపంచకప్‌నకు సిద్ధం చేయొచ్చు" - లసిత్ మలింగ, శ్రీలంక క్రికెటర్
టీ 20లకు మాత్రం మలింగ అందుబాటులో ఉంటాడని చెప్పింది శ్రీలంక క్రికెట్ బోర్డు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ 20 ప్రపంచకప్‌లో ఆడతాడని స్పష్టం చేసింది.
లంక తరఫున వన్డేల్లో 219 ఇన్నింగ్స్‌లో 335 వికెట్లు తీశాడు మలింగ. ఆ దేశం నుంచి అత్యధిక వికెట్లు తీసిన వన్డే బౌలర్లలో మూడో స్థానంలో ఉన్నాడు. ముత్తయ్య మురళీధరన్(523), చమిందావాస్(399) ఈ జాబితాలో ముందున్నారు.
ఈ ప్రపంచకప్‌లో 7 ఇన్నింగ్స్‌ల్లో 13 వికెట్లు తీసిన మలింగ.. శ్రీలంక జట్టులో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 30 టెస్టులు ఆడిన ఈ క్రికెటర్.. 101 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2011 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.