ఏ వృత్తిలోనైనా వయసు పెరిగే కొద్దీ ఉన్నత శిఖరాలకు చేరుతుంటారు. కానీ క్రీడాకారులు మాత్రం వయసు పెరిగితే వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. ఎన్ని మంచి ప్రదర్శనలు చేసినా.. ఆటగాడి కెరీర్లో రిటైర్మెంట్ అనేది తప్పనిసరిగా అధిగమించాల్సిన దశ. ప్రస్తుతం ఆ దశకు దగ్గరలో ఉన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. గావస్కర్ లాగా ఘనంగా వీడ్కోలు పలుకుతాడా... లేక కపిల్‌దేవ్ తరహాలో విమర్శలు ఎదుర్కొంటూ వైదొలుగుతాడా? అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.
దేశవాళీకీ దూరం..
38 ఏళ్ల ధోని రెండు నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ విరామం నవంబరు వరకు కొనసాగే అవకాశముంది. బంగ్లాదేశ్ సిరీస్‌కూ అందుబాటులో ఉండడు. ఇప్పటికే 45 రోజుల అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌ల షెడ్యూల్, శిక్షణ, యాంటీ డోపింగ్ పరీక్ష ప్రణాళికలను సిద్ధం చేసింది బీసీసీఐ. ఇందులో ఎక్కడా మహీ పేరు లేదని బీసీసీఐ వర్గాల సమాచారం. విజయ్ హజారే ట్రోఫీలో ఝార్ఖండ్ తరఫునా అతడి పేరు లేదు.
![mahendra singh dhoni retirement.!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/0521_dhaonai1_2209newsroom_1569161905_531.jpg)
"ఎవరూ పంపించకుండానే అతను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతాడని అనుకుంటున్నా. ఈ విషయంపై మహీ ఆలోచించాలి. అతను కనీసం నా జట్టులోనూ లేడు".
-సునీల్ గావస్కర్, భారత మాజీ క్రికెటర్.
సన్నీలా అందరికీ దొరకకపోవచ్చు...
సునీల్ గావస్కర్లా అందరికీ ఘనమైన వీడ్కోలు లభించకపోవచ్చు. 1987లో పాక్‌పై చిన్నస్వామి స్టేడియంలో సన్నీ చివరి టెస్టు ఆడాడు. టర్నింగ్, బౌన్సీ పిచ్‌పై దాయాది బౌలర్లను ఎదుర్కొని 96 పరుగులు చేశాడు. అప్పుడతడి వయసు 37. అప్పటికీ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. మరో రెండేళ్లు ఆడగల సత్తా ఉంది. కానీ రిటైర్మెంట్ పలికి అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. ఇంకొన్ని రోజులు ఆడుంటే బాగుండేది అనిపించుకున్నాడు.
![mahendra singh dhoni retirement.!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4532881_gava.jpg)
కపిల్ లాంటి దిగ్గజానికీ తప్పని విమర్శలు..
భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించిన కపిల్‌దేవ్ పరిస్థితి ఇందుకు విరుద్ధం. 1991 ఆస్ట్రేలియా పర్యటనలో కపిల్ వీడ్కోలు పలికాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం చేశాడని విమర్శలు ఎదుర్కొన్నాడు. మునపటి వేగం తగ్గి ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు. యువ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ టెస్టుల్లో మూడేళ్లు ఆలస్యంగా అరంగేట్రం చేయడానికి కారణం కపిలే అని కొంత మంది వాదన.
ముందుగానే గ్రహించిన గంగూలీ, ద్రవిడ్..
అయితే ఈ విషయంలో గంగూలీ, ద్రవిడ్ జాగ్రత్తపడ్డారు. గ్రెగ్ చాపెల్ కోచింగ్‌లో ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు సౌరవ్. అయితే రిటైర్మెంట్కు రెండేళ్ల ముందు గంగూలీ అద్భుతంగా ఆడాడు. 2008 ఆస్ట్రేలియా సిరీస్‌లో వీడ్కోలు పలికాడు. కొత్త టెస్టు సారథి ధోని, సెలక్టర్లు మళ్లీమళ్లీ తనను తప్పించొద్దనే భావంతో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2011లో ద్రవిడ్ సైతం అదే చేశాడు. సంకేతాలను ముందుగానే అర్థం చేసుకున్నాడు. ముందుగా వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. ఆర్నెళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో ఘోర పరాజయంతో ఇక తాను పూర్తిగా నిష్క్రమించాల్సిన అవసరం వచ్చిందని గ్రహించి వైదొలిగాడు ద్రవిడ్.
![mahendra singh dhoni retirement.!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4532881_gana.jpg)
యువకుల కోసం సచిన్..
సచిన్ తెందూల్కర్‌కు మాత్రం అందరికంటే ఘనమైన వీడ్కోలు లభించింది. శతకాలు చేయనప్పటికీ పరుగులు చేశాడు. ఫిట్‌గా ఉన్నాడు. యువకులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 2012 డిసెంబరులో వన్డేల నుంచి వైదొలిగాడు. 2013 నవంబరులో వెస్టిండీస్ సిరీస్‌లో టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని గంబీర్, సెహ్వాగ్ ఆలస్యంగా గ్రహించారు. చాలా రోజులు అవకాశం కోసం ఎదురుచూశారు. సంకేతాలు గ్రహించి రిటైర్మెంట్ ప్రకటించారు గంభీర్, సెహ్వాగ్.
![mahendra singh dhoni retirement.!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4532881_sach.jpg)
మిస్టర్ కూల్ మదిలో ఏముందో తెలియడం లేదు. అతడు వీడ్కోలుపై నిర్ణయం తీసుకోవాలని మాజీలు సైతం కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి..