రాజ్‌కోట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో యువ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ అద్భుతంగా రాణించాడు. టాప్ ఆటగాళ్ల వికెట్లు పడగొట్టి బంగ్లాను ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మణికట్టు మాంత్రికుడి ప్రదర్శనపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ. మధ్య ఓవర్లలో మరోసారి తన విలువను నిరూపించుకున్నాడని అన్నాడు. అతడు బ్యాట్స్‌మన్‌ను తెలివిగా బోల్తా కొట్టిస్తాడని కితాబిచ్చాడు.
"మాది కొత్త కుర్రాళ్లున్న జట్టు. కానీ చాహల్ రెండేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌లో మెరిసి జాతీయ జట్టులోకి వచ్చాడు. అప్పట్నుంచి టీమిండియాలో కీలక ఆటగాడిగా మారిపోయాడు. తానేం చేయాలో తనకు తెలుసు. బ్యాట్స్‌మన్ ఏం చేస్తాడో తెలుసు. మధ్య ఓవర్లలో చాహల్ అద్భుతంగా బంతులు వేస్తాడు. డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేసేందుకు భయపడడు. నేనతడిని 18వ ఓవర్లోనూ వాడుకున్నా"
-రోహిత్‌శర్మ
టీమిండియాలో అనుభవం లేని ఆటగాళ్లను లక్ష్యంగా ఎంచుకుంటామన్న బంగ్లాదేశ్ కోచ్ రసెల్ డొమింగో వ్యాఖ్యలపై రోహిత్ స్పందించాడు.
"అవును.. కుర్రాళ్లకు అంత అనుభవం లేదు. కానీ నేర్చుకోవడానికి వారికిదే సరైన సమయం. దేశవాళీ క్రికెట్లో నేర్చుకోవాలని వారికి మేమెప్పుడూ చెబుతుంటాం. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఆడేంత వరకు ఒక బౌలర్‌గా తన స్థానమేంటో ఎవరికీ తెలియదని నా భావన. అంతర్జాతీయ జట్టుతో తలపడటం సవాళ్లు, ఒత్తిడితో కూడుకున్నది" అని అన్నాడు హిట్‌మ్యాన్.

కెరీర్లో ప్రతిష్టాత్మక 100వ టీ20లో సెంచరీ కోల్పోవడంపైనా మాట్లాడాడు రోహిత్. శతకం చేజారినందుకు బాధలేదన్న హిట్‌మ్యాన్.. జట్టు గెలుపు కోసమే ఆడానని అందుకు సంతోషంగా ఉందని అన్నాడు.
టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ, బౌలర్ చాహల్‌ను.. టీ20ల్లో చెరో రికార్డు వేచి చూస్తోంది. రోహిత్ మరో రెండు సిక్సర్లు బాదితే అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున 400 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. చాహల్ టీ20లో మరో వికెట్ తీస్తే 50 వికెట్ల మైలురాయి అందుకున్న మూడో ఆటగాడిగా ఘనత సాధిస్తాడు.
నేడు భారత్-బంగ్లా జట్ల మధ్య నాగ్‌పుర్ వేదికగా మూడో టీ20 జరగనుంది. నాగ్‌పుర్ పిచ్ పరిస్థితి పరిశీలించిన రోహిత్..." మంచి వికెట్ పిచ్ ఇది. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేస్తే బౌలర్లకూ సహకరిస్తుంది. ప్రతిభ, వైవిధ్యం ఉంటే పిచ్ ఎలాగున్నా పర్వాలేదు" అని అన్నాడు.