పరిస్థితులన్నీ చక్కబడ్డాకే ఐపీఎల్‌పై ఏ నిర్ణయమైనా బీసీసీఐ తీసుకుంటుందని భారత మాజీ క్రికెటర్ మదన్‌లాల్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ విషయంపై మాట్లాడారు.
'ఐపీఎల్ అనేది పెద్ద బ్రాండ్. ఈ సీజన్ నిర్వహణపై బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకున్నా అది కరోనా వైరస్ సద్దుమణిగాకే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విషయం అలా ఉండిపోయింది. ఇప్పుడేవరూ రిస్క్ తీసుకోరు' -మదన్‌లాల్, టీమిండియా మాజీ క్రికెటర్
అందరికీ నచ్చే క్రికెట్‌ను ఆటగాళ్లు.. ప్రేక్షకుల ముందు ఆడేందుకు ఇష్టపడతారని మదన్‌లాల్ చెప్పారు. అదంతా ఇప్పుడున్న పరిస్థితులు చక్కబడ్డాకే జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే ఐపీఎల్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించడం అర్థంలేని విషయమన్నారు. అది కేవలం ఆటగాళ్లకు, అభిమానులకు మధ్య జరిగేది కాదని, ఈ లీగ్ ఎంతో మందికి సంబంధించినదని అన్నారు. అందులో ప్రయాణాలు, నిర్వహణ, బ్రాడ్‌కాస్టింగ్ లాంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. ఒక్కసారి పరిస్థితుల్లో మార్పు వస్తే సాధారణ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయని చెప్పారు. అప్పుడు బీసీసీఐ కోల్పోయిన సమయాన్ని కూడా తిరిగి పొందుగలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతకుముందు టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ మాట్లాడుతూ ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ ఆడే పరిస్థితులు ఏర్పడితే.. అందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.