ఈడెన్ గార్డెన్స్ వేదికగా గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో హర్భజన్ సింగ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చూసి ఫిదా అయ్యానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. వరుసగా 16 టెస్టుల్లో గెలిచి జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఆసీస్‌ను, 2001లో భారత్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ (59, 281), హర్భజన్ సింగ్ (7/123, 6/73) అదరగొట్టారు. ఈ మ్యాచ్ భారత క్రికెట్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. అయితే అప్పటి జ్ఞాపకాలను దాదా ఓ జాతీయ మీడియాతో పంచుకున్నాడు.
"తొలి చూపులోనే ప్రేమ పుడుతుందని అందరూ చెబుతుంటారు. ఈడెన్‌లో 13 వికెట్లు పడగొట్టిన హర్భజన్‌ను చూసి లవ్ ఎట్ ఫస్ట్‌సైట్‌గా అనిపించింది. అతడి బౌలింగ్ చూసి ఫిదా అయ్యా. భారత క్రికెట్‌లో అతడు మార్పులు తీసుకొస్తాడని నమ్మాను. తర్వాత అతడు 700 వికెట్లు పడగొట్టడం నాకు పెద్దగా ఆశ్చర్యమేమి అనిపించలేదు. భజ్జీ, కుంబ్లే.. ఇద్దరూ అత్యుత్తమ స్పిన్నర్లు. వారిద్దరు కలిసి ప్రత్యర్థులను పెవిలియన్‌కు చేర్చుతూ టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు"
-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
ఈ మ్యాచ్‌లో హర్భజన్ ఓ ఛాంపియన్‌గా బౌలింగ్ చేశాడని అన్నాడు గంగూలీ. అనుభవం లేకున్నా సత్తాచాటాడని చెప్పాడు.
"ఆసీస్ సిరీస్‌కు కుంబ్లే, శ్రీనాథ్ వంటి కీలక బౌలర్లు దూరమయ్యారు. జట్టులో కుంబ్లే లేకపోవడం ప్రత్యర్థులకు సానుకూలాంశం. ఆసీస్ సిరీస్ ఆరంభానికి ముందు భజ్జీకి అంతగా అనుభవం లేదు. సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లో అతడిని కొనసాగిస్తూ మరో స్పిన్నర్‌ను తీసుకున్నాం. తొలి మ్యాచ్‌లో రాహుల్ సంఘ్వి, రెండో టెస్టులో వెంకటపతి రాజు, ఆఖరి మ్యాచ్‌లో కులకర్ణిని తీసుకున్నాం. కానీ వికెట్లు పడగొట్టింది మాత్రం భజ్జీనే. అతడు ఛాంపియన్‌లా బౌలింగ్ చేశాడు"
-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
భారత్ తరఫున హర్భజన్ 711 వికెట్లు పడగొట్టాడు. 103 టెస్టుల్లో 417.. 236 వన్డేల్లో 269.. 28 టీ20ల్లో 25 వికెట్లు తీశాడు.
ఇవీ చూడండి: ఈ ఏడాది తొలి టెస్టు సెంచరీ లబుషేన్‌దే