కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రీడా ఈవెంట్లు స్తంభించిపోయాయి. దీంతో క్రీడాకారులు నూతనోత్తేజం పొందడానికి సరైన సమయం దొరికింది. అయితే, ఈ లాక్‌డౌన్ క్రికెటర్లకు ఎంతో ఉపయోగపడుతుందని, దీర్ఘకాలంలో కెరీర్ పొడిగింపులకు అనుకూలంగా మారొచ్చని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్ అభిప్రాయపడ్డాడు.
"ఈ లాక్‌డౌన్ వల్ల కలిగే లాభాలు భవిష్యత్‌లో చూస్తామని ఆశిస్తున్నా. ఇప్పుడైతే అంతా గందరగోళంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కఠిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలందరికీ ఇది క్లిష్ట సమయం. మళ్లీ ఇలాంటి పరిస్థితులు రాబోవని అనుకుంటున్నా. అయితే, ఈ లాక్‌డౌన్‌తో క్రికెటర్లకు మంచే జరిగిందని భావిస్తున్నా. అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి విశ్రాంతి దొరికింది. దీంతో మా కెరీర్‌లు మరిన్ని సంవత్సరాలు పొడిగించుకోవచ్చని భావిస్తున్నా.
-బట్లర్, ఇంగ్లాండ్ క్రికెటర్
యూరప్‌లో కరోనా వైరస్ కేసులు అధికసంఖ్యలో నమోదవుతున్నాయి. ఇటలీ, ఇంగ్లాండ్‌లో ఎక్కువ మరణాలు సంభవించాయి. కానీ, ఇలాంటి పరిస్థితుల్లోనూ బ్రిటన్ ప్రభుత్వం జూన్ 1 నుంచి పలు క్రీడలకు అనుమతిచ్చింది. ఇంగ్లాండ్ క్రికెటర్లు కూడా త్వరలోనే వ్యక్తిగత ట్రైనింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.
కరోనా వైరస్ తీవ్రత పెరగకముందు మార్చిలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన బట్లర్ అక్కడ చివరిసారి వార్మప్ మ్యాచ్ ఆడాడు. లంకతో సిరీస్ ఆరంభమవ్వాల్సిన సమయంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లని వెనక్కి పిలిచింది. ఇక అప్పటి నుంచి ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు.