టీమ్ఇండియా మాజీ సారథి గంగూలీ లాగే ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ కూడా భారత్-ఆస్ట్రేలియా పోరును మరో స్థాయికి తీసుకెళ్లాడని మాజీ కోచ్ జాన్ బుచానన్ పేర్కొన్నాడు. 'స్పోర్ట్స్‌స్టార్'తో ఇటీవలే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. గంగూలీలోని పలు నాయకత్వ లక్షణాలు విరాట్లోనూ ఉన్నాయని అన్నాడు.
'దాదా టీమ్ఇండియా బాధ్యతలు చేపట్టాక ఆటతీరులో మార్పు తెచ్చాడు. కేవలం క్రికెట్ ఆడటమే కాకుండా ఆస్ట్రేలియా లాంటి గొప్ప జట్లను ఓడించడం ఎలాగో నేర్పించాడు. ఇరు జట్ల మధ్య ఆధిపత్యానికి అది ఆరంభం మాత్రమే. దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లే సామర్థ్యం గంగూలీకి ఉంది. ఇప్పుడు కోహ్లీ కూడా అలాగే ఉన్నాడు. టీమిండియాను మరోస్థాయికి తీసుకెళ్లాడు' -బుచానన్, మాజీ కోచ్
'ఇప్పటి వరకు కోహ్లీ పరుగులు చేసినా చేయకపోయినా జట్టును నడిపించే తీరులో మంచి పనే చేశాడు. 2018-19 సిరీస్‌లో పుజారా మేటి ప్రదర్శన చేశాడు. అప్పుడు కోహ్లీ, రహానె తమవంతు పాత్ర పోషించారు. అయితే, కోహ్లీ జట్టును నడిపించిన తీరు, నాయకత్వ లక్షణాలే అసలైన గొప్పతనం. అతడు టీమ్ఇండియాను గెలిపించడమే కాకుండా ఇతర జట్లను ఓడించే మార్గాలను కనుగొన్నాడు' అని మాజీ కోచ్ వివరించాడు.
ఇక తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్ భారత్‌కు తిరిగి వచ్చేయడంపై స్పందిస్తూ.. అది టెస్టు సిరీస్‌లో కీలకం కానుందని వ్యాఖ్యానించాడు. కోహ్లీ సతీమణి అనుష్కశర్మ జనవరిలో మొదటిసారి బిడ్డకు జన్మనివ్వబోతుంది. అందుకే విరాట్ స్వదేశానికి రానున్నాడు.