పాకిస్థాన్ జట్టుకు ఆడకపోవడం తనను ఎంతగానో బాధించిందని తెలిపాడు దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. అండర్-19 వరకు ఆడినా తనకు అక్కడ ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించలేదని వెల్లడించాడు. 2011 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా జట్టులోకి అరంగేట్రం చేశాడు.
"నేను లాహోర్‌లోనే క్రికెట్ ఆడటం ప్రారంభించా. అక్కడ నేను ప్రధాన పాత్ర పోషించా. కానీ నాకు జాతీయ జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. నేను దక్షిణాఫ్రికా రావడానికి నా భార్య సుమయ్యా దిల్దార్ కారణం. కానీ పాకిస్థాన్‌ను వీడడం మాత్రం కష్టంగానే అనిపించింది."
-ఇమ్రాన్ తాహిర్, దక్షిణాఫ్రికా క్రికెటర్
తాహిర్ ఫ్యామిలీ 2006లో దక్షిణాఫ్రికాకు వెళ్లింది. ఆ తర్వాత సఫారీ జట్టులో స్పిన్నర్ల కొరత ఉండటం వల్ల తాహిర్ రూపంలో వారికి ఓ మంచి లెగ్ స్పిన్నర్ దొరికినట్లైంది. అలా 2011 ప్రపంచకప్ ద్వారా జట్టులోకి అరంగేట్రం చేసిన ఇతడు టోర్నీలో ఆ జట్టు తరఫున సెకండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
ఇప్పటివరకు 95 వన్డే మ్యాచ్‌ల్లో 156 వికెట్లు సాధించాడు తాహిర్. 2019 ప్రపంచకప్ సమయంలో వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.