ఆస్ట్రేలియా పర్యటన కోసం నెట్ బౌలర్‌గా ఎంపికైన టి.నటరాజన్.. ఏకంగా జట్టులో చోటు దక్కించుకుని చివరి వన్డే, టీ20 సిరీస్‌లో ఆడి అదిరిపోయే ప్రదర్శన చేశాడు. అద్భుత యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. సహచరులతో పాటు మిగతా ఆటగాళ్లతో శెభాష్ అనిపించుకున్నాడు.
టీ20 సిరీస్‌లో టీమ్ఇండియా విజయం సాధించిన అనంతరం బుధవారం సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నాడు. తనకు ఎంతో సహకరించిన సహచర క్రికెటర్లకు ధన్యవాదాలు తెలిపాడు. భారత్ తరఫున తొలి సిరీస్ విజయంతో తన కల నిజమైందని అన్నాడు.
![nataraj tweet about series win](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9816201_nattu.jpg)
బుమ్రా, షమి గైర్హాజరీతో టీ20లో భారత పేస్ దళాన్ని తన భుజానికెత్తుకున్నాడు నటరాజన్. కెప్టెన్ కోహ్లీ నమ్మకాన్ని నిలబెట్టాడు. పరుగులు నియంత్రిస్తూనే కీలక సమాయాల్లో వికెట్లు పడగొట్టి ఆకట్టుకునే ప్రదర్శన చేసి, అందరి మనసులు గెలుచుకున్నాడు.
తమిళనాడుకు చెందిన ఈ పేసర్.. ఈ ఏడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టాడు. యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టి, 16 వికెట్లు తీశాడు. ఇదే ఊపు కొనసాగిస్తే వచ్చే ఏడాది జరగబోయే స్వదేశంలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో నటరాజన్ కీలకం అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆసీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ 1-2 తేడాతో కోల్పోయిన కోహ్లీసేన.. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకుంది. డిసెంబరు 17 నుంచి మొదలయ్యే టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతోంది.
![team india t20 series win](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9816201_nattu14.jpg)
ఇది చదవండి: