ఆధునిక క్రికెట్లో గొప్ప ఆటగాడు ఎవరు? అనే ప్రశ్న వస్తే అందరూ దాదాపుగా చెప్పే సమాధానం విరాట్ కోహ్లీ! ఎందుకంటే టీమ్ఇండియా కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా రెండు బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, దిగ్గజ సచిన్ తెందుల్కర్ నెలకొల్పిన రికార్డులను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నాడు. వన్డేల్లో ఇటీవల 12 వేల పరుగుల మార్క్‌ను అందుకున్న కోహ్లీ.. సచిన్‌ను కూడా వెనక్కు నెట్టేశాడు. మాస్టర్ బ్లాస్టర్ మిగతా రికార్డులను చెరిపేసేందుకు విరాట్ సిద్ధమవుతున్నాడు.
అయితే సచిన్ ఆడినప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అలా అని ఎవరిని తక్కువ చేయడానికి లేదు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ-సచిన్.. 12 వేల పరుగులు చేయడంలో ఎలాంటి గణాంకాలు నమోదు చేశారు? ఎన్ని ఇన్నింగ్స్‌ల్లో ఆ మార్క్‌ను అందుకున్నారు? స్ట్రైక్ రేట్ ఎంత? తదితర అంశాల సమాహారమే ఈ కథనం.
12 వేల పరుగుల కోసం
వన్డేల్లో 12 వేల పరుగుల మార్క్‌ను అందుకునేందుకు కోహ్లీకి 242 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో 23వ పరుగులు చేసి, ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 63 పరుగులు చేసిన కోహ్లీ.. విజయంలో కీలకపాత్ర పోషించాడు.
సచిన్.. 12 వేల పరుగులు చేయడానికి 300 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. 2003 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో లీగ్ పోరులో ఈ మార్క్‌ను చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలవడం విశేషం.
ఎన్ని ఫోర్లు, ఎన్ని సిక్సర్లు?
వన్డేల్లో 12 వేల పరుగుల మార్క్‌ను అందుకునేటప్పటికి సచిన్ ఖాతాలో 1249 ఫోర్లు, 135 సిక్సులు ఉన్నాయి. కోహ్లీ విషయానికొస్తే 1130 ఫోర్లు, 124 సిక్సులు బాదాడు.
స్వదేశంలో ఎన్ని, విదేశాల్లో ఎన్ని?
12 వేల వన్డే పరుగుల మార్క్‌ను అందుకున్నప్పటికి సచిన్.. స్వదేశంలో 4015 పరుగులతో ఉండగా, కోహ్లీ 4865 పరుగులు చేశాడు. విదేశీ పిచ్‌లపై మాస్టర్ 8000 పరుగులు చేయగా, విరాట్ 7175 పరుగులతో ఉన్నాడు. ఈ విషయంలో దాదాపు సరిసమానంగా ఉన్నారు!
స్ట్రైక్‌రేట్ ఎంతెంత?
సరిగ్గా 12 వేల పరుగుల మార్క్‌ను అందుకున్న తర్వాత సచిన్ కెరీర్ స్ట్రైక్‌రేట్ 86.65గా ఉంది. స్వదేశంలో(4015 పరుగులు) 88.55గా, విదేశాల్లో 79.69, తటస్థ వేదికల్లో జరిగిన మ్యాచ్‌ల్లో 89.57గా ఉంది.
అదే కోహ్లీ విషయానికొస్తే 12 వేల వన్డే పరుగులు చేసిన తర్వాత 93.24గా కెరీర్ స్ట్రైక్‌రేటు ఉంది. స్వదేశంలో ఆడిన మ్యాచ్‌ల్లో 96.89.. విదేశాల్లో 91.13... తటస్థ వేదికల్లో 90.43 గా ఉంది.
వన్డేల్లో ఎవరు ఎన్ని పరుగులు?
ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్.. టీమ్ఇండియా తరఫున 463 వన్డేలాడి 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు ఉన్నాయి. 251 వన్డేలాడిన కోహ్లీ.. 12,040 పరుగులతో ఉన్నాడు. ఇందులో 43 సెంచరీలు ఉన్నాయి. మరో కొన్నేళ్లు ఆడే అవకాశమున్న నేపథ్యంలో విరాట్ ఇదే ఊపు కొనసాగిస్తే సచిన్‌ను పరుగులు, శతకాలు విషయంలో అధిగమించడం పెద్ద కష్టమేమి కాదు.