ఈతరం క్రికెటర్లలో విరాట్ కోహ్లీయే అత్యుత్తమమని ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ ఛాపెల్ అన్నారు. క్రికెట్ పుస్తకంలోని షాట్లనే ఆడటం, దృఢమైన దేహదారుఢ్యమే అన్ని ఫార్మాట్లలో అతడిని అత్యుత్తమ క్రికెటర్‌గా రూపొందించాయని వెల్లడించారు.
"స్టీవ్‌స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్‌తో కూడిన బృందంలో మూడు ఫార్మాట్లలో కోహ్లీయే అత్యుత్తమం. ఇందులో సందేహమే లేదు. మూడు ఫార్మాట్లలో ప్రత్యేకించి పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి రికార్డులు అద్భుతం"
-ఇయాన్ ఛాపెల్, ఆస్ట్రేలియా మాజీ సారథి
"కోహ్లీ బ్యాటింగ్ తీరు నాకిష్టం. టీమ్‌ఇండియా చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు అతడిని మేం ఇంటర్వ్యూ చేశాం. పొట్టి క్రికెట్లో కొత్తతరం, ఫ్యాన్సీ షాట్లు ఎందుకాడవని ప్రశ్నించాం. సుదీర్ఘ ఫార్మాట్లో లయ తప్పకూడదనే ఆ షాట్లు ఆడనని మాతో చెప్పాడు. నా తరంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో వివ్ రిచర్డ్స్ అత్యుత్తమం. అతను సాధారణ క్రికెట్ షాట్లే ఆడేవాడు. బంతిని చక్కగా మిడిల్ చేస్తూ వేగంగా పరుగులు సాధించేవాడు. కోహ్లీ కూడా అంతే. సంప్రదాయ షాట్లనే కచ్చితత్వంతో ఆడతాడు" అని ఛాపెల్ ప్రశంసించారు.
"విరాట్ అత్యుత్తమం అయ్యేందుకు ఫిట్‌నెస్ ఎంతో మేలుచేసింది. అతడు వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగెత్తుతాడు. తన ప్రమాణాలను తనే పెంచుకుంటాడు. అతడి ప్రదర్శనల్లో కొన్ని అద్భుతం. ఓటమికి భయపడకపోవడం అతడిలో నచ్చే మరో అంశం. గెలిచే ప్రయత్నంలోనే ఓటమికి సిద్ధమవుతాడు. నా దృష్టిలో కెప్టెన్ అలాగే ఉండాలి. ఉద్వేగాలు ఎక్కువ కాబట్టి సారథ్యం అతడి ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని భావించా. కానీ అదే భావోద్వేగాన్ని ఉపయోగించుకొని అతడు మరింత మెరుగయ్యాడు. నిజంగా అతనో తెలివైన క్రికెటర్" అని ఛాపెల్ తెలిపారు.