ఐపీఎల్లో ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ అన్నాడు.
"తీవ్ర ఒత్తిడితో కూడిన ఐపీఎల్లో మూడు బాధ్యతలు చేపట్టనుండటం మేలు చేస్తుందా? ప్రతికూలంగా మారుతుందా? అన్నది తెలియదు. ఈ సవాలును ఎదుర్కొనేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా"
-కేఎల్ రాహుల్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్
ధోనీ రిటైర్మెంట్ వల్ల టీమ్ఇండియాలోనూ వికెట్‌కీపర్‌గా తొలి ప్రాధాన్యం రాహుల్‌నే వరించే అవకాశం కనిపిస్తోంది. కీపింగ్ నైపుణ్యంలో ధోనీతో పోల్చడం ఒత్తిడికి గురిచేస్తుందా అన్న ప్రశ్నకు.. "ఇప్పటికైతే లేదు. ప్రస్తుతం నా దృష్టంతా ఐపీఎల్‌పైనే. భారత క్రికెట్లో ధోనీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. జట్టులో ఎలాంటి బాధ్యత అప్పగించినా చేపట్టేందుకు సిద్ధం" అని చెప్పాడు.
"వికెట్లు నెమ్మదిగా ఉండే పక్షంలో ప్రత్యర్థి జట్టును 170 పరుగులలోపు కట్టడి చేయాలి. క్రీజులో కుదురుకున్న బ్యాట్స్‌మెన్ 20వ ఓవర్ వరకు ఆడటం ముఖ్యం. దుబాయ్‌కు రాకముందు కొంచెం ఒత్తిడికి లోనయ్యాం. చాలా రోజులు క్రికెట్ ఆడలేదు. టోర్నీలో అందరి పరిస్థితి అదే. నైపుణ్యాల్ని సానబెట్టుకునేందుకు ఈ మూడు వారాల సమయం ఎంతో ఉపయోగపడుతుంది" అని రాహుల్ చెప్పాడు.
రాహులే మా వికెట్ కీపర్!
కేఎల్ రాహులే తమ తొలి ప్రాధాన్య వికెట్‌కీపర్ అని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. "కేఎల్ కచ్చితంగా వికెట్ కీపింగ్ చేస్తాడు" అని చెప్పాడు. రాహుల్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, నిర్ణయాలు తీసుకోవడంలో అది ఉపయోగపడుతుందని కుంబ్లే అన్నాడు. "సీజన్‌కు కెప్టెన్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. రాహుల్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. బెంగుళూరులో పెరిగాడు. పంజాబ్ తరఫున రెండు సీజన్లు ఆడిన అతడికి జట్టు గురించి నాకన్నా ఎక్కువ తెలుసు" అని కుంబ్లే చెప్పాడు