ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. మరో కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. వచ్చే సీజన్లో ప్రతి మ్యాచ్‌కు ముందు భారత జాతీయ గీతాన్ని ప్లేచేసే ఆలోచన చేయాలని జట్టు సహ యజమాని నెస్వాడియా, బీసీసీఐకి ప్రతిపాదన పంపారు. అదే విధంగా ఐపీఎల్ ప్రారంభ వేడుకల్ని రద్దు చేయాలనే ఆలోచన చాలా మంచిదని అన్నారు.
"ఇదో అద్భుతమైన ఆలోచన. ప్రతిసారీ ప్రారంభ వేడుక ఖర్చు చూసి ఆశ్చర్యపోయేవాడిని. దానిని రద్దు చేయాలనే ఆలోచన నిజంగా చాలా మంచిది. అదే విధంగా వచ్చే సీజన్ నుంచి ప్రతి మ్యాచ్‌కు ముందు భారత జాతీయ గీతం ప్లే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను"
-నెస్వాడియా, పంజాబ్ జట్టు సహ యజమాని
సాధారణంగా భారత్ ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో జాతీయ గీతం పాడుతారు. అయితే ఈ లీగ్‌లోనూ దీనిని ప్లే చేయాలనే ప్రతిపాదన చేసింది పంజాబ్ జట్టు.
ప్రస్తుతం భారత జాతీయ గీతం ఇండియన్ సూపర్ లీగ్(ఫుట్‌బాల్), ప్రొ కబడ్డీ లీగ్‌లో ప్లే చేస్తున్నారు.
"ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉన్నందుకు మనం గర్వపడాలి. అదే విధంగా అద్భుతమైన జాతీయ గీతం మన సొంతం. ఎన్బీఏ మ్యాచ్‌లు జరిగే సమయంలో ప్రతి మ్యాచ్‌కు ముందు ఆ దేశపు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు" -నెస్వాడియా, పంజాబ్ జట్టు సహ యజమాని
డిసెంబరు 18న ఐపీఎల్ వేలం జరగనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇది చదవండి: ఐపీఎల్-2020 ఆరంభ వేడుకలు రద్దు!