భారత్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రముఖ సంస్థలు, క్రికెట్ సంఘాలు తమవంతు సాయమందిస్తున్నాయి. ఈ జాబితాలోకి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం(కేఎస్సీఏ) చేరింది. కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది. బీసీసీఐ ద్వారా ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరిసగం ఇస్తున్నట్లు పేర్కొంది.
బీసీసీఐ ద్వారా 'పీఎం-కేర్స్'కు
కేంద్రానికి ఇచ్చే రూ. 50 లక్షలను బీసీసీఐ ద్వారా ప్రధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్(పీఎం-కేర్స్)కు అందించనున్నట్లు కేఎస్సీఏ తెలిపింది. బంగాల్, ముంబయి, సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్స్ తమవంతు సాయమందించేందుకు ముందుకొచ్చాయి. అంతకు ముందు బీసీసీఐ.. రూ.51 కోట్లను ఈ సహాయనిధికి ఇస్తున్నట్లు చెప్పింది.
భారత్లో 25 మంది మృతి
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 30వేల మందికిపైగా మరణించారు. భారత్లో ఇప్పటివరకు 25 మంది మృత్యువాతపడ్డారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరాటానికి 16 ఏళ్ల మహిళా క్రికెటర్ చేయూత