ఐపీఎల్ కాంట్రాక్టులను కాపాడుకోవడం కోసం ఆస్ట్రేలియా క్రికెటర్లు.. టీమ్‌ఇండియా కెప్టెన్ కోహ్లీతో మంచిగా ఉన్నారన్న మైకెల్ క్లార్క్ వ్యాఖ్యలను వీవీఎస్ లక్ష్మణ్ తప్పు పట్టాడు. ఎవరితోనో మంచిగా ఉన్నంత మాత్రాన కాంట్రాక్టులు రావని అన్నాడు.
"ఎవరితోనో మంచిగా ఉన్నంత మాత్రాన ఐపీఎల్‌లో చోటు దక్కదు. జట్టులోకి తీసుకోవడానికి ఏ ఫ్రాంఛైజీ అయినా ఆటగాడి సామర్థ్యం, అతడు జట్టుకు ఎంత విలువను చేకూరుస్తాడన్నది చూస్తుంది. మ్యాచ్‌లు/టోర్నమెంట్లు గెలిపిస్తారనుకునే ఆటగాళ్లవైపే మొగ్గు చూపుతుంది. అలాంటి ఆటగాళ్లకే ఐపీఎల్ కాంట్రాక్టులు దక్కుతాయి. అంతే కానీ.. ఎవరితోనో మంచిగా ఉంటే కాంట్రాక్టులు రావు"
-వీవీఎస్ లక్ష్మణ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
"ఏ భారత ఆటగాడితోనైనా ఓ విదేశీయుడు స్నేహంగా ఉన్నాడంటే.. దానర్థం అతడికి ఐపీఎల్ కాంట్రాక్టు వస్తుందని కాదు. మార్గనిర్దేశకుడిగా నేను ఐపీఎల్ వేలంలో పాల్గొన్నా. తమ తమ దేశాల తరఫున బాగా ఆడిన విదేశీయులనే మేం ఎంపిక చేశాం" అని లక్ష్మణ్ స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ ఐపీఎల్ కాంట్రాక్టులను కాపాడుకునేందుకు ఓ దశలో భారత కెప్టెన్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయడానికి భయపడ్డారని ఇటీవల క్లార్క్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పైన్ ఈ ఆరోపణలను ఖండించాడు.