వెస్టిండీస్‌తో సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో టెస్టులో తాను బరిలోకి దిగలేకపోవచ్చని ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అంటున్నాడు. బయో బబుల్ నిబంధనలు అతిక్రమించానని తనపై కొంతమంది జాతివివక్ష వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణమని చెప్పాడు.
విండీస్‌తో తొలి టెస్టు తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఆర్చర్ ఇంటికి వెళ్లాడు.దాంతో అతణ్ని రెండో టెస్టు నుంచి తప్పించడం సహా జరిమానా కూడా విధించారు. చివరిదైన మూడో టెస్టులో ఆడేందుకు అనుమతిచ్చారు. అయితే నిబంధనలు ఉల్లఘించడపై సామాజిక మాధ్యమాల్లో కొంతమంది తనను దూషించారని దాంతో మానసిక బాధ అనుభవిస్తున్నట్లు ఆర్చర్ తెలిపాడు.
"మానసికంగా 100 శాతం సిద్ధంగా ఉంటేనే ఈ వారం క్రికెట్ ఆడతా. ఒకవేళ నేను మ్యాచ్‌లో ఆడి.. గంటకు 90 మైళ్ల వేగంతో బౌలింగ్ చేయకపోతే అదో వార్తగా మారుతుంది. నేనెప్పుడు బరిలో దిగినా వంద శాతం ప్రదర్శన చేస్తా. అలాంటి భరోసా ఇవ్వలేకపోయినప్పుడు మైదానంలో అడుగుపెట్టాలని అనుకోను. గత కొన్ని రోజులుగా నా జాతిని దూషిస్తూ ఉన్న ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూశా. ఇక ఓపికగా ఉండలేకపోతున్నా. ఇప్పటి వరకు జరిగింది చాలు. అందుకే ఈ విషయంపై ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి ఫిర్యాదు చేశా. అవగాహనారాహిత్యంతో తప్పు చేశా. దానికి తగిన శిక్ష అనుభవించా. నేనేం పెద్ద నేరం చేయలేదు" అని జోఫ్రా ఆర్చర్ పేర్కొన్నాడు. తాను అందుబాటులో లేకున్నా ఇంగ్లాండ్ బౌలింగ్ వనరులకు ఎలాంటి కొరతలేదని అతను అన్నాడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన స్టోక్స్‌కు ఆర్చర్ ధన్యవాదాలు తెలిపాడు.