టీమ్ఇండియాతో మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ. ఆ జట్టు పేసర్ ప్యాటిన్సన్ సిడ్నీ టెస్టుకు దూరమయ్యాడు. ఛాతీ కండరాల గాయం కారణంగా అతడు జట్టుకు అందుబాటులో ఉండటం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే, అతడికి ప్రత్యామ్నాయంగా మరో ఆటగాడిని తీసుకోలేదు. జనవరి 7 నుంచి 11 వరకు సిడ్నీ వేదికగా కీలకమైన మూడో టెస్టు జరుగనుంది.
"ఛాతీ కండరాల గాయంతో ఫాస్ట్‌బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ ఆస్ట్రేలియా-భారత్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మరొకరిని ఎంపిక చేయలేదు. కింద పడటం వల్ల ప్యాటిన్సన్ గాయపడ్డాడు. బ్రిస్బేన్ టెస్టుకు ముందు అతడిని పరీక్షిస్తాం"
-క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన
ప్యాటిన్సన్ చివరగా టెస్టు సిరీసుకు ముందు సన్నాహక మ్యాచులో ఆడి మూడు వికెట్లు తీసుకున్నాడు. టీమ్‌ఇండియాతో తొలి రెండు టెస్టుల్లో తుది జట్టులో అతడికి చోటు దక్కేలేదు. ఆసీస్ తరఫున అతడు 21 మ్యాచుల్లో 26.33 సగటుతో 81 వికెట్లు తీసుకున్నాడు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, నేథన్ లైయన్‌తో కూడిన బౌలింగ్ దాడిలో అతడికి చోటు దొరకడం లేదు.