టీమ్‌ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ టెస్టుల్లో మాజీ ఓపెనర్ సెహ్వాగ్ ఆడినన్ని మ్యాచ్‌లు ఆడలేకపోవచ్చని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. సెహ్వాగ్ ఈ ఫార్మాట్‌లో 100 మ్యాచ్‌లు ఆడగా రోహిత్ అన్ని టెస్టులు ఆడతాడా అనే విషయంపై సందేహం తలెత్తుతుందని చెప్పాడు. రోహిత్ వన్డేల్లో ఛాంపియన్‌గా కొనసాగుతున్నా టెస్టు మ్యాచ్‌లు ఆడటంలో మాజీ క్రికెటర్ కన్నా వెనుకంజలోనే ఉంటాడని వివరించాడు. అలాగే అతడు పూర్తి ఆరోగ్యంగా ఉంటే సెహ్వాగ్ వలే ప్రభావం చూపుతాడన్నాడు. ఇదివరకే వన్డేలు, టెస్టుల్లో ద్విశతకాలు బాదాడని గుర్తుచేశాడు.
రోహిత్ టెస్టు క్రికెట్ ఇప్పుడు మారిందని, గతంతో పోలిస్తే చాలా మార్పులొచ్చాయని చెప్పాడు ఇర్ఫాన్. టెస్టుల్లో అతడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఉన్నప్పుడు అందరూ ఆశించినంతగా రాణించలేకపోయాడన్నాడు. అంతకుముందు గంభీర్ మాట్లాడుతూ సెహ్వాగ్ రెండు ఫార్మాట్లలో రాణించాడని, వన్డేల్లో ఎలా ఆడాడో టెస్టుల్లోనూ అలాంటి ప్రదర్శనే చేశాడని చెప్పాడు. అయితే, రోహిత్ వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్నా సెహ్వాగ్ వలే ప్రభావం చూపుతాడనడంలో సందేహం ఉందన్నాడు.
హిట్‌మ్యాన్ గతేడాదే టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్టు సిరీస్‌లో రెండు శతకాలు, ఒక ద్విశతకంతో చెలరేగాడు. దీంతో రాబోయే రోజుల్లోనూ అతడు విదేశాల్లో మంచి ప్రదర్శన చేస్తాడని పఠాన్ అభిప్రాయపడ్డాడు.