టీమ్‌ఇండియాలో తను టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అవ్వడానికి గల కారణాన్ని వివరించాడు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. తనను ప్రమోట్ చేసింది క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అని తెలిపాడు. అలా తాను పలు సందర్భాల్లో టాప్‌ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసినట్టు చెప్పాడు. 'బియాండ్ ది ఫీల్డ్' అనే కార్యక్రమంలో మాట్లాడిన పఠాన్ ఈ విషయాలను వెల్లడించాడు.
"నేను రిటైర్మెంట్ ఇచ్చాక కూడా ఈ విషయంపై స్పష్టతనిచ్చాను. నా కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోవడానికి ఛాపెల్ కారణమని భావించే వారికి అసలు విషయం చెప్పదల్చుకున్నా. నన్ను వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేయాలని సచిన్.. అప్పటి సారథి రాహుల్ ద్రవిడ్‌కు సూచించాడు. నేను బాగా సిక్సులు కొట్టగలనని, కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోగలనని చెప్పాడు. అలా నన్ను 2005లో శ్రీలంక సిరీస్‌లో తొలి వన్డేలో టాప్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దింపారు. అప్పుడు మురళీథరన్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. దాంతో అతడిపై ఆధిపత్యం చెలాయించాలని జట్టు భావించింది. అప్పుడే దిల్హారా ఫెర్నాండో 'స్ల్పిట్ ఫింగర్ స్లో బాల్' అనే కొత్త పద్ధతిని అవలంబించాడు. అది బ్యాట్స్‌మన్‌కు సరిగ్గా అర్థం కాలేదు. దాంతో అతడిపైనా నేను దాడి చేస్తే మా ప్రణాళిక విజయవంతమవుతుందని అనుకున్నాం."
-ఇర్ఫాన్ పఠాన్, టీమ్ ఇండియా మాజీ ఆల్‌రౌండర్.
దీంతో పాటు తన కెరీర్ గాడి తప్పడానికి కారణం మాజీ కోచ్ గ్రేగ్ ఛాపెల్ కాదని స్పష్టం చేశాడు. అతడు భారతీయుడు కానందున చాలా తేలిగ్గా అతనిపై నిందలు మొపొచ్చని పఠాన్ అభిప్రాయపడ్డాడు. అయితే, టీమ్‌ఇండియాలో తన స్థానంపై జట్టు యాజమాన్యం సరిగ్గా వ్యవహరించలేదని పేర్కొన్నాడు పఠాన్. ఈ నేపథ్యంలోనే 2008లో శ్రీలంకతో ఆడిన ఓ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమి అంచున ఉన్నా.. తానే గెలిపించానని గుర్తుచేసుకున్నాడు.
ఇది చూడండి : 'పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత్ ఎప్పుడూ సురక్షితమే'