టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత వన్డేల్లో వేగం పెరిగింది. 50 ఓవర్ల ఫార్మాట్లోనూ పరుగుల వరద పారిస్తున్నారు బ్యాట్స్‌మెన్. నేడు డబ్లిన్ వేదికగా జరిగిన ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రికార్డుల మోత మోగించారు వెస్టిండీస్ ఓపెనర్లు.
మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఓపెనర్లు షాయ్ హోప్- జాన్ క్యాంప్‌బెల్... మొదటి వికెట్‌కు 365 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డే చరిత్రలో ఇదే అత్యధికం. ఇంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్ జోడీ ఫకార్ జమాన్-ఇమాముల్ హక్ పేరిట ఉంది. 2018లో జింబాబ్వేపై వీరిద్దరూ కలిసి 304 పరుగులు చేశారు.
వన్డేల్లో ఏ వికెట్‌కైనా ఈ మ్యాచ్‌లో హోప్-క్యాంప్‌బెల్‌ల భాగస్వామ్యమే రెండో అత్యుత్తమం. మరో 8 పరుగులు చేసుంటే అత్యధిక భాగస్వామ్యం చేసిన జోడిగా అరుదైన ఘనత సాధించేవారు కరీబియన్లు.
వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యం ఇదే
- 2015లో జింబాబ్వేతో మ్యాచ్‌లో రెండో వికెట్‌కు 372 పరుగులు జోడించారు గేల్- మర్లోన్ శ్యాముల్స్.
వీరిద్దరి భాగస్వామ్యానికి మరో రికార్డు
- వన్డే ఫార్మాట్లో ఇద్దరు ఓపెనర్లు 150కు పైగా పరుగులు చేసింది ఈ మ్యాచ్‌లోనే.
- క్యాంప్‌బెల్.. 137 బంతుల్లో 179 పరుగులు చేయగా, షాయ్ హోప్.. 152 బంతుల్లో 170 పరుగులు చేశాడు.
- వీరిద్దరూ కలిసి 8 సిక్స్‌లు, 37 ఫోర్లు కొట్టారు.
50 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లకు 381 పరుగులు చేసింది వెస్టిండీస్ జట్టు. ఐర్లాండ్ జట్టులో ఒక్క బౌలర్ మాత్రమే ఆకట్టుకున్నాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన బ్యారీ మెకర్తీ.. 76 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.
బంగ్లాదేశ్, ఐర్లాండ్, వెస్టిండీస్ మధ్య ముక్కోణపు సిరీస్ జరుగుతోంది. ఫైనల్‌తో కలిపి మొత్తం ఏడు మ్యాచులు జరుగుతాయి.