ఐపీఎల్.. ఏ ఆటగాడైనా తన ప్రతిభను నిరూపించుకోవడానికి చక్కని వేదిక. ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో సహా అన్ని దేశాల క్రికెటర్లు ఈ మెగాలీగ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. 2008లో ప్రారంభమైన ఈ టోర్నీ ద్వారానే రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా సహా ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. మైదానంలో చెలరేగిపోతున్నారు. అయితే కొందరు మాత్రం ఒక్క సీజన్‌తోనే ఆకాశమంతా స్టార్డమ్ సంపాదించుకున్నారు. బరిలో దిగితే ఆట రూపురేఖలే మార్చేస్తారనేలా కీర్తి గడించారు. దీంతో తర్వాతి సీజన్ల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూడటం ప్రారంభించారు. కానీ వారు మాత్రం పేలవ ప్రదర్శనతో వీక్షకులకు నిరాశను మిగిల్చారు. కొందరైతే ఏకంగా కనుమరుగైపోయారు. ఇంతకీ వారెవరు? సాధించిన అద్భుతమైన గణాంకాలేంటి?
పాల్ వల్తాటి
పాల్ వల్తాటి.. 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడాడు. ఆ ఏడాది 35.61 స్ట్రైక్‌రేట్‌తో 14 మ్యాచుల్లో 463 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 120. ఎవరు ఊహించని విధంగా సీఎస్కేపై 63 బంతుల్లోనే 120 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఆ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా రికార్డు సాధించాడు. కానీ ఆ జోరును తదుపరి సీజన్లో కొనసాగించలేకపోయాడు. 2012లో కేవలం ఆరు మ్యాచులు ఆడగా.. 2013లో ఒక్కటి ఆడాడు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా తరఫున ఆడుతున్నాడు.
రాహుల్ శర్మ
యువ స్పిన్నర్ రాహుల్ శర్మ(దక్కన్ ఛార్జర్స్)ను అందరూ అశ్విన్‌తో పోల్చేవారు. 2011 సీజన్లో సచిన్ వికెట్ తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అదే ఏడాది 17.06 స్ట్రైక్‌రేట్‌తో 14 మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి జాతీయ జట్టులో చోటు లభించింది. నాలుగు వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. కానీ అనుకోని రీతిలో మాదక ద్రవ్యాలు సేవించి జాతీయ జట్టులో నిషేధానికి గురయ్యాడు. చివరగా 2012లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో పాల్గొన్నాడు. ప్రస్తుతం పంజాబ్‌లోని అంతర్ జిల్లా మధ్య జరిగే మ్యాచులు ఆడుతున్నాడు.
స్వప్నిల్ అశ్నోడ్కర్
2008 ఐపీఎల్.. తొలి ఏడాదే టైటిల్‌ను ఎగరేసుకుపోయింది రాజస్థాన్ రాయల్స్. ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు స్వప్నిల్ అశ్నోడ్కర్. తొమ్మిది మ్యాచుల్లో 311 పరుగులు చేసి ఔరా అనిపించాడు. గ్రేమ్ స్మిత్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వీరిద్దరూ 59.71 సగటుతో 418 పరుగలు చేశారు. కానీ ఆ తర్వాత ఆడిన సీజన్లలో పేలవమైన ప్రదర్శనతో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి అభిమానులను నిరాశ పరిచాడు.
మన్విందర్ బిస్లా
2012లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు మన్విందర్ బిస్లా. ఆ సీజన్లో చైన్నై జట్టుపై చేసిన 89 పరుగులు... జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాయి. ఆ ఏడాదే కేకేఆర్ తొలిసారి ట్రోఫీని అందుకోవడం విశేషం. దీంతోపాటు 2013లోనూ 30.42స్టైక్‌రేట్‌తో 14 మ్యాచుల్లో 255 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత అతడి ఆటతీరు సరిగ్గాలేక ఫ్రాంచైజీలు వేలంపాటలో కొనడం కూడా మానేశాయి. అలా ఐపీఎల్‌కు దూరమైపోయాడు.
డౌగ్ బొలింగర్
ఐపీఎల్లో అత్యంత ప్రతిభ గల బౌలర్లలో ఒకడు బొలింగర్. 2010లో తొలిసారి చెన్నై సూపర్‌కింగ్స్ ట్రోఫీని అందుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. 2012లోనూ ఇదే జోరు చూపించాడు. మొత్తంగా ఐపీఎల్లో 27 మ్యాచులాడి 37 వికెట్లు తీశాడు. ఇంతటి అద్భుత గణాంకాలను నమోదు చేసినప్పటికీ.. అనూహ్యంగా యాజమాన్యం కొద్దికాలానికే ఇతడిని పక్కన పెట్టేసింది.