ఐపీఎల్ 13వ సీజన్లో నిరాశపర్చి, తమ ఫ్రాంఛైజీల నమ్మకాన్ని వమ్ముచేసిన కొందరు విదేశీ ఆటగాళ్లు.. స్వదేశం తరఫున మ్యాచ్‌ల్లో సత్తా చాటుతున్నారు. లీగ్ ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే పలు సిరీస్‌లు, టోర్నీల్లో అదరహో అనిపిస్తున్నారు. అప్పుడు నిరాశపర్చిన వారే ఇలా ఆడుతున్నారా? అనేంతగా వీక్షకులను మైమరపిస్తున్నారు. విఫలమైన ప్రత్యర్థి బౌలర్లపైనే తమదైన ప్రదర్శనతో చెలరేగుతున్నారు.
స్టీవ్ స్మిత్...
ఐపీఎల్‌లో బ్యాటింగ్‌తో మెప్పించలేకపోయాడు ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్. ఇతడి కెప్టెన్సీలో రాజస్థాన్ జట్టు ఘోరంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలే సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. సీజన్ మొత్తంగా 311 పరుగులు చేసి స్థాయికి తగ్గట్లు ఆటలేకపోయాడు. భారత్‌తో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో మాత్రం స్వదేశం తరఫున చెలరేగి ఆడుతున్నాడు. రెండు వన్డేల్లోనూ వరుసగా(105, 104 పరుగులు) సెంచరీలు చేసి అదరగొట్టాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్..
పంజాబ్ జట్టుకు ఆడిన మ్యాక్స్‌వెల్.. ఈసారి ఐపీఎల్‌లో తీవ్రంగా నిరాశపర్చాడు. టీ20ల్లో విధ్వంసక ఆటగాడిగా పేరున్న ఇతడు.. ఐపీఎల్-2020లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌ల్లో 108 పరుగులే చేశాడు. ఇందులో ఒక్క సిక్సర్ కూడా లేదు. అయితే భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మాత్రం సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో 45 పరుగులు(19 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), 63 పరుగులు(29 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అదరగొట్టాడు.
ఆరోన్ ఫించ్..
భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన ఆరోన్ ఫించ్.. ఈసారి ఐపీఎల్‌లో తన ఫ్రాంచైజీ బెంగళూరు తరఫున దిగి ఘోరంగా విఫలమయ్యాడు. 12 మ్యాచ్‌ల్లో 268 పరుగులు మాత్రమే చేశాడు. స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మాత్రం వావ్ అనిపిస్తున్నాడు. రెండు మ్యాచ్‌లోనూ 114 పరుగులు(124 బంతుల్లో,9 ఫోర్లు, 4 సిక్సర్లు), 60 పరుగులు(69 బంతుల్లో,6 ఫోర్లు, 1 సిక్సర్) చేసి.. సహ ఆటగాళ్లనే ఆశ్చర్యపరిచాడు.
రసెల్..
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రూ రసెల్.. ఈ సీజన్లో 10 మ్యాచ్‌లాడి 117 పరుగులే చేశాడు. గత సీజన్లలో ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన రసెల్.. ఈసారి మాత్రం పూర్తిగా నిరాశపర్చాడు. అయితే లంక ప్రీమియర్ లీగ్‌లో(ఎల్పీఎల్) మాత్రం విధ్వంసక ప్రదర్శన చేస్తున్నాడు. కొలంబో కింగ్స్ తరఫున రెండు మ్యాచ్‌లాడి.. 13 బంతుల్లో 24 పరుగులు(3 ఫోర్లు, 1 సిక్సర్), 19 బంతుల్లో 65 రన్స్(9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు.
బెయిర్ స్టో
ఐపీఎల్‌లో దారుణంగా విఫలమైన విదేశీ ఆటగాళ్లలో బెయిర్ స్టో ఒకడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌గా గతేడాది అద్భుతంగా రాణించినప్పటికీ ఈ సీజన్లో మాత్రం నిరాశపర్చాడు. 11 మ్యాచ్‌ల్లో 345 పరుగులే చేశాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో టీ20లో మాత్రం వీరవిహారం చేశాడు. 48 బంతుల్లో 86 పరుగులతో(9 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయంగా నిలిచాడు. ఫలితంగా తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్ల తేడాతో తన జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
జిమ్మీ నీషమ్..
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్.. ఈ సారి పంజాబ్ జట్టుకు పెద్దగా న్యాయం చేయలేకపోయాడు. 5 మ్యాచ్‌లాడి 2 వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటింగ్‌లోనూ కేవలం 19 పరుగులే చేశాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో అదరగొట్టాడు. 24 బంతుల్లో 48 పరుగులు(5 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి ఆహా అనిపించాడు.
ఆడమ్ జంపా..
బెంగళూరు తరఫున బరిలోకి దిగిన జంపా.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేదు. 3 మ్యాచ్‌ల్లో కేవలం 2 వికెట్లు తీశాడు. భారత్‌తో జరిగిన రెండు వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఇతడు.. తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసి 4 కీలక వికెట్లు తీసుకున్నాడు. రెండో వన్డేలోనూ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.