దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్, నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచ్చనేకు కరోనా సోకింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
![Sandeep Lamichhane](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9698476_lami.jpg)
"ప్రతీ ఒక్కరికీ నమస్కారం. నాకు కరోనా సోకిందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం నా కనీస బాధ్యత. బుధవారం నుంచి ఒళ్లు నొప్పులు మొదలయ్యాయి. అయితే, ఇప్పుడు బాగానే కోలుకుంటున్నా. అంతా మంచి జరిగితే నేను మళ్లీ మైదానంలో అడుగుపెడతా. మీ ప్రార్థనల్లో నన్ను గుర్తుంచుకోండి"
-- సందీప్ లామిచ్చనే
సందీప్ గత మూడేళ్లుగా ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. 2018 సీజన్‌లో 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీసిన అతడు.. గతేడాది 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. కానీ, ఇటీవల జరిగిన 13వ సీజన్‌లో మాత్రం దిల్లీ అతడికి తుది జట్టులో చోటివ్వలేదు.
పాక్ క్రికెట్‌లో ఇంకొకరికి..
మరోవైపు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టులో ఇంకో ఆటగాడికి కరోనా సోకినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో 3 టీ20లు, 2 టెస్టులు ఆడేందుకు 53 మంది పాక్ ఆటగాళ్లు ఈనెల 24న క్రైస్ట్‌చర్చ్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే చేసిన పరీక్షల్లో ఆరుగురు వైరస్ బారిన పడ్డారు. వారిని ప్రత్యేక ఐసోలేషన్‌కు తరలించగా, మిగతా ఆటగాళ్లను హోటల్ గదులకే పరిమితం చేశారు. ఈ క్రమంలోనే రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో ఇంకో ఆటగాడికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో అతడిని కూడా ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించారు. మొత్తంగా ఏడుగురు పాక్ ఆటగాళ్లు కరోనాబారిన పడ్డారు.