ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించిన మినీ వేలం గురువారం (ఫిబ్రవరి 18) జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాయి ఫ్రాంచైజీలు. వేలానికి ముందు జట్లు వదిలేసిన స్టార్ ఆటగాళ్లపై కొన్ని ఫ్రాంచైజీలు కన్నేశాయి. వారిని భారీ ధరకు దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారీ ధర పలికి జాక్‌పాట్ కొట్టబోయే అవకాశం ఉన్న ఆటగాళ్లెవరో చూద్దాం.
క్రిస్ మోరిస్
గతేడాది ఐపీఎల్ వేలానికి ముందు అసలు క్రిస్ మోరిస్‌ను ఏ జట్టైనా తీసుకుంటుందా? అనే అనుమానం ఉండేది. కానీ ఇతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గత సీజన్లో గాయం కారణంగా అన్ని మ్యాచ్‌లు ఆడని మోరిస్.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు దక్కించుకున్నాడు. బ్యాట్‌తోనూ రాణించాడు. కానీ ఈసారి మినీ వేలానికి ముందు అంటిపెట్టుకున్న ఆటగాళ్లను ప్రకటించిన ఆర్సీబీ మోరిస్‌ను వదిలేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఆల్‌రౌండర్ల విభాగంలో మోరిస్‌కు ఈసారి కూడా భారీ ధర దక్కే అవకాశం ఉంది.
స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌కు అనూహ్యంగా మొండిచేయి చూపించింది రాజస్థాన్ రాయల్స్. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా గతేడాది కెప్టెన్‌గానూ ఈ జట్టుకు స్మిత్ సేవలందించాడు. అయితే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కానీ అతడికున్న అంతర్జాతీయ అనుభవంతో ఈసారి వేలంలో కూడా భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాడు మ్యాక్స్‌వెల్. ఇతడిని పంజాబ్ 10.75 కోట్లకు దక్కించుకుంది. కానీ ఆ డబ్బుకు, జట్టు నమ్మకాన్ని వమ్ము చేస్తూ గత సీజన్లో ఇతడు 106 బంతుల్లో 108 పరుగులు మాత్రమే చేశాడు. సీజన్ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా కొట్టకపోవడం గమనార్హం. దీంతో ఇతడిని వదులుకుంది పంజాబ్. కానీ ఒక్క సీజన్‌తో మ్యాక్స్‌వెల్ సామర్థ్యానికి ఎలాంటి ముప్పు లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీ20 క్రికెట్లో అతడికున్న అనుభవమే ఇందుకు కారణం. దీంతో ఈసారి కూడా ఇతడు భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది.
శివం దూబే
టీమ్ఇండియాకు అరంగేట్రం చేయకముందే యువ ఆటగాడు శివం దూబేను 2018 సీజన్లో 5 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆ సీజన్లో ఎక్కువ అవకాశాలు దక్కకపోయినా భారత జట్టులో చోటు దక్కించుకున్న కారణంగా గతేడాదీ అతడిని అట్టిపెట్టుకుంది. కానీ వారి నమ్మకాన్ని అతడు నిలబెట్టుకోలేకపోయాడు. దీంతో మినీ వేలానికి ముందు దూబేను వదిలేసింది బెంగళూరు. కానీ ఇది అతడికి మేలు చేసే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.
ఆరోన్ ఫించ్
రాజస్థాన్.. కెప్టెన్ స్మిత్‌ను వదిలేయగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్‌ను వదిలేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. గతేడాది ఇతడిని 4.8 కోట్లకు దక్కించుకుంది కోహ్లీసేన. కానీ గత సీజన్లో అంత గొప్ప ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం 268 పరుగులు చేసి రెండో అర్ధ భాగంలో జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ అతడి ఐపీఎల్ గణాంకాలు చూస్తే.. మొత్తం 87 మ్యాచ్‌లు ఆడి 127 స్ట్రైక్ రేట్‌తో 2005 పరుగులు చేశాడు. ఈ గణాంకాలే ఇతడికి మినీ వేలంలోనూ మంచి ధర పలికేలా చేసే అవకాశం ఉంది.
డేవిడ్ మలన్
రెండేళ్లుగా టీ20 క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ తరఫున 19 టీ20లు ఆడిన మలన్ 53.44 సగటుతో 855 పరుగులు చేశాడు. ఆడిన 19 మ్యాచ్‌ల్లో పదింటిలో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాడు. అత్యధికంగా న్యూజిలాండ్‌పై సెంచరీ, దక్షిణాఫ్రికాపై 99 పరుగులు చేశాడు. ఈ గణాంకాలే ఈసారి వేలంలో మలన్‌కు భారీ ధర దక్కేలా చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మిగిలిన వారిలో!
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వదిలేసిన ఆల్‌రౌండర్ ముజిబుర్ రెహ్మన్ ఈసారి వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది. అలాగే కోల్‌కతా ఆటగాడు క్రిస్ గ్రీన్ కూడా విలువైన ఆటగాడిగా నిలవొచ్చు. వ్యక్తిగత కారణాల వల్ల గత సీజన్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఈ టోర్నీలోనే అత్యధిక ధర పలికే విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన జాసన్ రాయ్ ముంబయి వదిలేసిన నాథన్ కౌల్టర్ నైల్ కూడా మంచి ధర పలికే అవకాశం ఉంది.