ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ వేలానికి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 19 కోల్‌కతాలో ఈ కార్యక్రమం జరగనుంది. మొత్తం 971 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా 332 మంది వేలానికి ఎంపికయ్యారు. వీరికి సంబంధించిన జాబితాలను బీసీసీఐ అన్ని ఫ్రాంఛైజీలకు అందజేసింది. మొత్తం 186 దేశీయ, 143 విదేశీ ఆటగాళ్లు, 3 సంయుక్త భాగస్వామ్య దేశాల ఆటగాళ్లు ఈ ఏడేది వేలంలో పోటీ పడనున్నారు. ఇందులో 73 మందిని మాత్రమే అదృష్టం వరించనుంది. ఈ ఏడాది దేశవాళీల్లో రాణించి పేరు తెచ్చుకున్న ఐదుగురు యువ క్రికెటర్లు ఈ వేలంపాటలో భారీ ధర దక్కించుకొనే అవకాశముంది.
హనుమ విహారి...
ఉత్తరప్రదేశ్ తరఫున రంజీల్లో పోటీపడిన ఈ ఆల్‌రౌండర్... ఈ ఏడాది 800 పైగా పరుగులు చేశాడు. ఇందులో శతకం కూడా ఉంది. ఈ ఏడాది విండీస్‌పై ఆడిన టెస్టుల్లో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 32 బంతుల్లో 46 పరుగులు చేసి ఫామ్ నిరూపించుకున్నాడు. గతేడాది దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన ఇతడు.. అప్పట్లో 2 కోట్ల ధర పలికాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ రెండుసార్లే అవకాశం వచ్చింది. తాజాగా 50 లక్షల కనీస ధరతో మళ్లీ వేలంలో అడుగుపెడుతున్నాడు.
ప్రియమ్ గార్గ్
కొంత కాలంగా దేశవాళీ పోటీల్లో మార్మోగుతోందీ పేరు.. ఈ కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్ తానాడిన తొలి రంజీ సీజన్ (2018-19)లోనే అదరగొట్టాడు. 800కి పైగా పరుగులు సాధించి సత్తా చాటాడు. గోవాతో ఆడిన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిసిన ప్రియమ్.. ఆ తర్వాత తొలి ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ (206) కూడా సాధించాడు. ఇటీవల దేవదర్ ట్రోఫీ ఫైనల్లో 77 బంతుల్లో 74 రన్స్ చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న అండర్-19 టీ20 ప్రపంచకప్‌కు ఇతడు సారథ్యం వహించనున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఆడని ఇతడు.. 20 లక్షల కనీస ధరతో ఈ ఏడాది వేలంలో పాల్గొననున్నాడు.
విరాట్ సింగ్..
14 ఏళ్ల వయసులోనే ఝార్ఖండ్ తరఫున అండర్-19లో అరంగేట్రం చేశాడు విరాట్ సింగ్. 2012-13లో వినూ మన్కడ్ ట్రోఫీలోనూ బరిలోకి దిగాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 10 ఇన్నింగ్స్‌లో 343 పరుగులు చేశాడు. సగటు 57.16 ఉంది. స్ట్రయిక్ రేటు 142.32గా ఉండటం విశేషం. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది విజేత కర్ణాటక జట్టుపై 44 బంతుల్లో 76 రన్స్ చేశాడు. దేవదర్ ట్రోఫీ ఇండియా-సీ జట్టులోనూ ఇతడు సభ్యుడు. కనీస ధర 20 లక్షలతో బరిలోకి దిగుతున్నాడు.
యశస్వి జైస్వాల్....
విజయ్‌హజారె ట్రోఫీలో ఈ 17 ఏళ్ల ముంబయి బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఝార్ఖండ్‌పై ద్విశతకం బాది రికార్డు సృష్టించాడు. ప్రపంచ లిస్ట్-ఎ మ్యాచుల్లో డబుల్ సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. అంతేకాక లిస్ట్-ఎ క్రికెట్‌లో భారత్ తరఫున ద్విశతకం బాదిన ఏడో క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఝార్ఖండ్ బౌలర్లపై చెలరేగి 154 బంతుల్లోనే 203 పరుగులు చేశాడు. దీనిలో 17 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. యశస్వి భారత అండర్-19 జట్టులో కీలక ఆటగాడు. ఇతడు తొలిసారి 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వస్తున్నాడు.
జలజ్ సక్సేనా...
కేరళ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూకు ప్రాతినిధ్యం వహించిన 32 ఏళ్ల సక్సేనా... ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 6000 పరుగులు, 300 వికెట్లు తీసిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు. రైట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన ఈ క్రికెటర్ ఇప్పటి వరకు 113 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 6,044 పరుగులు చేశాడు. 305 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ అతడిని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది 30 లక్షల కనీస ధరతో వేలంలోకి దిగుతున్నాడు
కోల్‌కతాలో వేలం...
ఐపీఎల్ 13వ సీజన్ కోసం డిసెంబర్ 19న వేలం నిర్వహించనున్నారు. 2019లో ఫ్రాంఛైజీకి రూ.82 కోట్లు కేటాయించగా 2020 సీజన్‌కు ఈ సారి మూడు కోట్లు పెంచి రూ.85 కోట్లుగా నిర్ణయించారు. వీటితో పాటు గతేడాది మిగిలిన నిధులను కూడా వేలంలో జట్టు యాజమాన్యాలు ఉపయోగించుకోవచ్చు.
మిగిలిన నిధులు: దిల్లీ క్యాపిటల్స్ రూ .(7.7 కోట్లు), రాజస్థాన్ రాయల్స్ (రూ. 7.15 కోట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ .6.05 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 5.30 కోట్లు), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (రూ. 3.7 కోట్లు), ముంబయి ఇండియన్స్ (రూ. 3.55 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 3.2 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ .1.80 కోట్లు).