క్రికెట్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు మామూలే. పాత నిబంధనలు పోతుంటాయి. కొత్త షరతులు వస్తుంటాయి. వివాదాస్పదంగా, ఆటకు ఇబ్బందికరంగా మారే కొన్ని నిబంధనలను మార్చడం అనివార్యం.
అంతర్జాతీయ క్రికెట్లో వచ్చే మార్పులను ఐపీఎల్ కూడా అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా తయారవుతుంటుంది. ఈసారి లీగ్‌లో కొన్ని కీలక మార్పులు చూడబోతున్నాం. అవేంటంటే..?
టీ20 మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌ను 90 నిమిషాల్లో ముగించాలన్నది నిబంధన. అయితే ఐపీఎల్‌లో ఈ విషయంలో కొంత వెసులుబాటు ఉండేది. 90వ నిమిషంలో ఇన్నింగ్స్ చివరి ఓవర్ మొదలైనా చాలు. స్లో ఓవర్ రేట్‌గా పరిగణించరు. అయితే ఈ వెసులుబాటును జట్లు ప్రతిసారీ ఉపయోగించుకుంటుండటం, చివరి ఓవర్లు మరీ నెమ్మదిగా వేస్తుండటం వల్ల మ్యాచ్‌లు గతంతో పోలిస్తే 10-15 నిమిషాల ఆలస్యం అవుతుండటం వల్ల ఈసారి నిబంధన మార్చారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ 90 నిమిషాల లోపే ఇన్నింగ్స్ పూర్తి కావాల్సిందే. ఆ వ్యవధిని దాటితే భారీ జరిమానా పడుతుంది. జట్లు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తుంటే.. ఓవర్‌రేట్ నిబంధనను సవరించి హెచ్చరిక జారీ చేసే అధికారాన్ని అంపైర్లకు బీసీసీఐ కట్టబెట్టింది.
ఈ మధ్య అంతర్జాతీయ క్రికెట్లో బాగా వివాదాస్పదం అయిన సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను ఐపీఎల్‌కు పక్కన పెట్టింది బీసీసీఐ. క్యాచ్, అబ్‌స్ట్రక్ట్ ద బాల్ లాంటి నిర్ణయాల విషయంలో సాంకేతిక ఆధారంగా మూడో అంపైర్‌కు స్పష్టత రానపుడు ఫీల్డ్ అంపైర్ ముందుగా సూచనప్రాయంగా ప్రకటించిన నిర్ణయాన్నే (సాఫ్ట్ సిగ్నల్) పరిగణలోకి తీసుకుంటాడు. ఇలాంటి వాటిలో ఇకపై ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో ప్రమేయం ఉండదు. మూడో అంపైరే సాంకేతికత సాయంతో పొందిన స్పష్టత మేరకు తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాడు.
షార్ట్ రన్ విషయంలో కూడా బీసీసీఐ నిబంధనలు మార్చింది. బ్యాట్స్‌మెన్ పరుగు సరిగ్గా పూర్తి చేశాడా లేదా అనే విషయంలో అంపైర్ సరైన నిర్ణయం ప్రకటించలేదని భావిస్తే.. మూడో అంపైర్ దాన్ని మార్చొచ్చు.
ప్రాక్టీస్.. ప్రాక్టీస్:
ఒకవైపు బెంగళూరు.. మరోవైపు చెన్నై.. ఇంకోవైపు దిల్లీ.. ఇలా ఐపీఎల్ జట్లు పూర్తి స్థాయి సాధనలో మునిగితేలుతున్నాయి. మరో 9 రోజుల్లో ఐపీఎల్ ఆరంభం కానున్న నేపథ్యంలో జట్లన్నీ ప్రాక్టీస్ జోరును పెంచాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ మంగళవారం సాధన షురూ చేశాయి.
ఇవీ చదవండి: