షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్‌ను నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతుండటం, ముంబయిలో మైదాన సిబ్బందికి కొవిడ్ సోకడం వల్ల లీగ్ నిర్వహణపై అనుమానాలు పెరిగాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్ విధించింది. అయినా లీగ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని సౌరభ్ పేర్కొన్నాడు. మహారాష్ట్ర క్రికెట్ సంఘం కూడా మ్యాచ్‌లు సజావుగా సాగుతాయనే ధీమా వ్యక్తం చేస్తోంది.
"ముంబయి మున్సిపల్ కమిషనర్‌తో చర్చించాం. లాక్‌డౌన్ నిబంధనల వల్ల ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం ఉండదని భరోసా లభించింది" అని మహారాష్ట్ర క్రికెట్ సంఘం తెలిపింది. కరోనా తీవ్రత కారణంగా వేదికల జాబితా నుంచి ముంబయిని తప్పిస్తే.. హైదరాబాద్‌లో సురక్షితంగా మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ చెప్పాడు.
ఇదీ చదవండి: బుమ్రా ఐపీఎల్ అరంగేట్రానికి ఎనిమిదేళ్లు
కర్ఫ్యూతో సమస్య లేదు: బీసీసీఐ
మహమ్మారి విలయతాండవంలో లీగ్ నిర్వహణ సాధ్యమేనా? మహారాష్ట్రలో రాత్రుళ్లు కర్ఫ్యూ ఉంటే ఆటగాళ్లు హోటళ్ల నుంచి స్టేడియానికి, స్టేడియం నుంచి హోటళ్లకి ఎలా వస్తారు? అనే సందేహాలపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. ఆటగాళ్లంతా బయో బబుల్‌లోనే ఉంటున్నందున కర్ఫ్యూ ప్రభావం లీగ్‌పై పెద్దగా ఉండదని పేర్కొంది.
"జట్లలోని ప్రతీ ఆటగాడితో పాటు వారి ప్రయాణ బస్సులు, డ్రైవర్లు, సిబ్బంది అంత బయో బబుల్లోనే ఉంటున్నారు. కాబట్టి మ్యాచ్ రోజుల్లో హోటల్ నుంచి స్టేడియానికి వెళ్లడంలో ఎటువంటి సమస్య రాదు. సాధారణ పరీక్షలు ప్రతిఒక్కరికీ పూర్తయ్యాయి. గతేడాది యూఏఈలో నిర్వహించిన మాదిరే ఈ సారి కూడా లీగ్‌ను కట్టుదిట్టంగా నిర్వహిస్తాం" అని బీసీసీఐ తెలిపింది.
మరోవైపు క్రీడాకారులందరికీ టీకా పంపిణీ చేసేందుకు బోర్డు.. కేంద్ర ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతోందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వైరస్ కట్టడికి టీకా ఏకైక పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ధోనీ, కోహ్లీలను అధిగమించి ఫకర్ ప్రపంచ రికార్డు