ఏప్రిల్ 9న ఐపీఎల్ 14వ సీజన్ మొదలవనుంది. రోహిత్ మెరుపులు, కోహ్లీ అరుపులు, ధోనీ వ్యూహాలతో మైదానాలు సందడిగా మారనున్నాయి. గతేడాది కరోనా కారణంగా యూఏఈలో జరిగిన ఈ టోర్నీ ఈసారి స్వదేశంలోనే జరగనుంది. ప్రేక్షకుల అనుమతిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన ప్రీమియర్ లీగ్‌లన్నింటిలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌పై ఓ లుక్కేద్దాం.
విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహిస్తోన్న కోహ్లీ.. జట్టుకు కప్పు తీసుకురావడంలో మాత్రం విఫలమవుతున్నాడు. బ్యాట్స్‌మన్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నా ఛాలెంజర్స్‌ను విజయతీరాలకు చేర్చలేకపోతున్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న కోహ్లీ మిగతా ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటివరకు 192 మ్యాచ్‌లు ఆడి 184 ఇన్నింగ్స్‌ల్లో 38.16 సగటుతో 5,878 పరుగులు సాధించాడు విరాట్. ఇందులో ఐదు సెంచరీలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి.
సురేశ్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్)
ఒకప్పుడు టీమ్ఇండియా మిడిలార్డర్లో ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు రైనా. తర్వాత ఫామ్ కోల్పోయాడు. చాలాకాలం పాటు తుది జట్టులో స్థానం కోసం ఆశగా ఎదురుచూసిన ఇతడు గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్లో అయినా అతడి ఆట చూడొచ్చు అనుకున్న అభిమానులకు నిరాశే మిగిల్చాడు. టోర్నీ ప్రారంభానికి ముందే యూఏఈ చేరుకున్నా.. వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి తిరిగి వచ్చాడు. దీంతో మిడిలార్డర్లో సమతుల్యం కోల్పోయిన సీఎస్కే టోర్నీలో తీవ్రంగా నిరాశపర్చింది. ప్రతి ఐపీఎల్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసే రైనా మొత్తం ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు. 193 మ్యాచ్‌లు ఆడి 189 ఇన్నింగ్స్‌ల్లో 33.34 సగటుతో 5,368 పరుగులు చేశాడీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు. ఇందులో 1 శతకం, 38 అర్ధశతకాలు ఉన్నాయి.
డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
విధ్వంసకర ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. బాల్ టాంపరింగ్ వివాదంతో ఓ ఏడాది ఆటకు దూరమయ్యాడు. తర్వాత 2019 ఐపీఎల్‌తో పునరాగమనం చేసిన వార్నర్.. వచ్చీరాగానే సత్తాచాటాడు. మళ్లీ తన ఫామ్ నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు మొత్తం 142 మ్యాచ్‌లాడి 142 ఇన్నింగ్స్‌ల్లో 42.71 సగటుతో 5,254 పరుగులు సాధించాడు. ఇందులో 4 శతకాలు, 48 అర్ధశతకాలు ఉన్నాయి.
రోహిత్ శర్మ (ముంబయి ఇండియన్స్)
ముంబయి ఇండియన్స్‌కు సారథ్యం వహిస్తోన్న రోహిత్ ఐపీఎల్లో జట్టును విజయ పథాన నడిపిస్తున్నాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన హిట్‌మ్యాన్ పొట్టి ఫార్మాట్లోనూ తనదైన హిట్టింగ్తో ఆకట్టుకోగల సమర్థుడు. ఇప్పటివరకు జట్టుకు నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు అందించి కెప్టెన్‌గా తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. లీగ్‌లో మొత్తం 200 మ్యాచ్‌లు ఆడి 195 ఇన్నింగ్స్‌ల్లో 5,230 పరుగులు సాధించి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇందులో 1 శతకం, 39 అర్ధశతకాలు ఉన్నాయి.
శిఖర్ ధావన్ (దిల్లీ క్యాపిటల్స్)
తన విధ్వంసకర బ్యాటింగ్‌తో గబ్బర్‌గా పేరుతెచ్చుకున్నాడు శిఖర్ ధావన్. పరిమిత ఓవర్ల క్రికెట్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ధావన్.. ఐపీఎల్‌లోనూ సత్తాచాటుతున్నాడు. ఇప్పటివరకు 176 మ్యాచ్‌లాడిన గబ్బర్ 175 ఇన్నింగ్స్‌ల్లో 34.41 సగటుతో 5,197 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 41 అర్ధశతకాలు ఉన్నాయి.