సంచలనాలకు వేదికైన ఐపీఎల్-2021 వేలం ప్రక్రియ ముగిసింది. ఇందులో 164 మంది భారతీయులు, 125 మంది విదేశీయులు, ముగ్గురు అసోసియేట్ సభ్య దేశాల ఆటగాళ్లు పోటీపడ్డారు. ఫ్రాంచైజీలు రూ.145.30 కోట్లు వెచ్చించి 57 మందిని సొంతం చేసుకున్నాయి. 22 విదేశీ ఆటగాళ్లను దక్కించుకున్నాయి. మరి ఈ ఐపీఎల్ వేలంలో ఎవరెవరని ఏ జట్టు కొనుగోలు చేసిందో ఇప్పుడు చూద్దాం.
- వేలంలో మొదటి పేరు కరుణ్ నాయర్. ఆఖరి పేరు అర్జున్ తెందూల్కర్. కరుణ్‌ను తొలుత ఎవరూ కొనుగోలు చేయలేదు. రెండో దఫాలో కోల్‌కతా సొంతం చేసుకుంది. అర్జున్ను ముంబయి కనీస ధర రూ.20 లక్షలకు తీసుకుంది.
- దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ ఐపీఎల్ వేలంలోనే అత్యధిక ధర సొంతం చేసుకున్నాడు. రూ.16.25 కోట్లకు అతడిని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
- వేలం తర్వాత రాజస్థాన్ (24), బెంగళూరు (22) కాకుండా మిగతా అన్ని ఫ్రాంచైజీల్లో 25 మంది ఆటగాళ్లు ఉన్నారు.
- వేలం ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.18.80 కోట్లు మిగిలుంది. ఆ తర్వాత రాజస్థాన్ (రూ.13.65 కోట్లు), హైదరాబాద్ (రూ.6.95 కోట్లు) ఉన్నాయి.
- అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో ముగ్గురిని పంజాబ్ సొంతం చేసుకుంది. చెన్నై, బెంగళూరు చెరో ఇద్దరిని, రాజస్థాన్ ఒకరిని తీసుకుంది.
- జాతీయ జట్టుకు ఆడకుండా ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడు కృష్ణప్ప గౌతమ్. రూ.9.25 కోట్లు పెట్టి చెన్నై కొనుగోలు చేసింది.
- తమిళనాడు యువ ఆటగాడు షారుక్ ఖాన్‌ను పంజాబ్ రూ.6.95 కోట్లకు తీసుకోవడం ప్రత్యేకం.
- ఈ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఆరుగురు కన్నా ఎక్కువ మందిని తీసుకోగా ఒక్క సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే ముగ్గుర్ని తీసుకుంది. అందులో కేదార్ జాదవ్ కోసం మాత్రమే అత్యధికంగా రూ.2 కోట్లు వెచ్చించింది.
- ఈ వేలంలో హైదరాబాద్, పంజాబ్, రాజస్థాన్, ముంబయి కనీసం ఒక్క బ్యాట్స్‌మన్‌నూ తీసుకోలేదు. ఎక్కువగా ఆల్‌రౌండర్లు, తక్కువగా బౌలర్లను తీసుకున్నాయి.
- టీమ్ఇండియా నయావాల్, టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్ పుజారా మళ్లీ ఐపీఎల్లో అడుగుపెడుతున్నాడు. 2014లో అతడు పంజాబ్‌కు ఆడాడు. ఆ తర్వాత ఇప్పుడే చెన్నైకి ఆడనున్నాడు. రూ.50 లక్షలతో ధోనీసేన అతడిని కొనుగోలు చేసింది.
- భారీ ధర పలుకుతారని భావించిన జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్, ఆరోన్ ఫించ్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు.
- చెన్నై విడుదల చేసిన వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది. తొలుత అతడిని కొనుగోలు చేయలేదు. రెండో దఫాలో సొంతం చేసుకుంది.
- తెలుగు కుర్రాడు హరిశంకర్ రెడ్డి (బౌలర్)ను చెన్నై సూపర్‌కింగ్స్ రూ.20 లక్షలకు తీసుకుంది.
- 2013 నుంచి ఇప్పటివరకు జరిగిన ఏ ఐపీఎల్ వేలంలోనూ ఒక బ్యాట్స్‌మెన్ అత్యధిక ధర పలకలేదు. ప్యాట్ కమిన్స్ మినహా అంతా ఆల్‌రౌండర్లే కావడం గమనార్హం.
- ఫ్రాంచైజీలు ఖర్చు చేసిన మొత్తంలో దాదాపుగా 50% ఐదుగురు ఆటగాళ్లకే పోయింది. మోరిస్, జేమిసన్, మాక్స్వెల్, రిచర్డ్సన్, కృష్ణప్ప గౌతమ్‌ల మొత్తం ధర రూ.68.75 కోట్లు.
- కోల్‌కతా తరఫున వేలానికి షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, జుహీచావ్లా కుమార్తె జాహ్నవి మెహతా హాజరవ్వడం విశేషం.