ఆలస్యంగా అయినా సరే.. ఐపీఎల్ అయితే జరగబోతోంది. ఎప్పుడూ ఏప్రిల్లో మొదలయ్యే ఈ లీగ్.. ఈ సారి సెప్టెంబర్లో ఆరంభం కాబోతుంది. అదీ యూఏఈలో. అందులోనూ ఖాళీ స్టేడియాల్లో. ఈ నెల 19నే లీగ్ ప్రారంభం కాబోతుంది. నేడే (ఆదివారం) షెడ్యూల్ ప్రకటించబోతున్నారు. భారత్‌లో మాదిరి కాకుండా కేవలం మూడు వేదికల్లోనే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ మూడు వేదికల విశేషాలేంటో ఓసారి చూద్దాం పదండి.
దుబాయ్ అంతర్జాతీయ స్డేడియం (స్పోర్ట్స్ సిటీ, దుబాయ్)
ఆరంభం : 2009
సామర్థ్యం : 25 వేలు
టీ20 మ్యాచ్‌లు : 24
సగటు స్కోరు : 157
అత్యధికం : 211 (2013లో పాకిస్థాన్‌పై శ్రీలంక)
అత్యల్పం : 145 (2013లో పాకిస్థాన్‌పై శ్రీలంక)
అత్యధిక వ్యక్తిగత స్కోరు : 84 (2013లో పాక్‌పై కుశాల్ పెరీ0రా)
అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన : 5/14 (2016లో వెస్టిండీస్‌పై పాకిస్థాన్ స్పిన్నర్ ఇమాద్ వసీమ్)
ప్రఖ్యాత దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో భాగమైన దుబాయ్ అంతర్జాతీయ స్టేడియాన్ని యూఏఈలోని అత్యుత్తమ క్రికెట్ మైదానంగా చెప్పొచ్చు. ఇది బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. యూఏఈలోని మైదానాల్లో అత్యధిక సగటు టీ20 స్కోరు (157) ఉన్నది ఇక్కడే. అయితే ఈ మైదానంలో బౌండరీలు పెద్దవి. మిగతా రెండు వేదికలతో పోలిస్తే ఇక్కడ పేసర్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లకూ పిచ్ అనుకూలిస్తుంది.
షార్జా క్రికెట్ స్టేడియం (షార్జా)
ఆరంభం : 1982
సామర్థ్యం : 16 వేలు
టీ20 మ్యాచ్‌లు : 14
సగటు స్కోరు : 138
అత్యధికం : 215 (2016లో జింబాబ్వేపై అఫ్ఘానిస్థాన్)
అత్యల్పం : 56 (2013లో అఫ్ఘానిస్థాన్‌పై కెన్యా)
అత్యధిక వ్యక్తిగత స్కోరు : 118 (2106లో జింబాబ్వేపై అఫ్ఘాన్ బ్యాట్స్‌మన్ మహ్మద్ షెజాద్)
అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన : 5/13 (2013లో కెన్యాపై అఫ్ఘాన్ స్పిన్నర్ సమియుల్లా షిన్వారి)
యూఏఈలో పాత స్టేడియం ఇదే. ఎప్పుడో 1982లోనే ఈ స్టేడియాన్ని నిర్మించారు. 90ల్లో ఇక్కడ ఆసక్తికర పోరాటాలు జరిగాయి. ఆస్ట్రేలియాపై సచిన్ మెరుపు ఇన్నింగ్స్‌లకు షార్జానే వేదిక. గత దశాబ్ద కాలంలో దుబాయ్, అబుదాబి స్టేడియాలకు ప్రాధాన్యం పెరిగి ఇక్కడ మ్యాచ్‌లు తగ్గిపోయాయి. ఇక్కడి పిచ్ కూడా బాగా నెమ్మదించింది. టీ20 సగటు స్కోరు 138 మాత్రమే ఇక్కడ నమోదయ్యింది. ఇక్కడ స్పిన్నర్లదే ఆధిపత్యం.
షేక్ జాయెద్ స్టేడియం (అబుదాబి)
ఆరంభం : 2006
సామర్థ్యం : 20 వేలు
టీ20 మ్యాచ్‌లు : 25
సగటు స్కోరు : 147
అత్యధికం : 225 (2013లో ఐర్లాండ్‌పై అఫ్ఘానిస్థాన్)
అత్యల్పం : 130 (2010లో నెదర్లాండ్‌పై కెన్యా)
అత్యధిక వ్యక్తిగత స్కోరు : 117 (2107లో పపువా న్యూ గినియాపై యూఏఈ బ్యాట్స్‌మన్ షైమర్ అన్వర్)
అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన : 4/13 (2019లో నైజీరియాపై ఐర్లాండ్ పేసర్ క్రెయిగ్ యంగ్)
యూఏఈలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు (25) జరిగింది ఈ స్టేడియంలోనే. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు, బౌలింగ్‌కు సమానంగా సహకరిస్తుంది. బౌలింగ్‌లో స్పిన్నర్లదే ఇక్కడ ఆధిపత్యం. నిలదొక్కుకుంటే బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లు చేయోచ్చు. స్టేడియంతో పాటు బౌండరీలు పెద్దవి కావడం వల్ల ఇక్కడ సిక్సర్లు బాదడం అంత తేలికేమి కాదు.