రికీ పాంటింగ్ ప్రధాన కోచ్‌గా నియమితుడైనప్పటి నుంచి దిల్లీ ఫ్రాంచైజీ సరికొత్త ఉత్సాహంతో దూసుకెళ్తోంది. 2018 సీజన్ ముందు నుంచే పాంటింగ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని శిక్షణలో 2018 సీజన్ పట్టికలో దిల్లీ జట్టు తక్కువ స్థానాన్ని పొందినప్పటికీ.. ఆ తర్వాత సీజన్లో మూడో స్థానంలో నిలిచింది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జట్టును మరో స్థాయికి తీసుకెళ్లాడని దిల్లీ ఫ్రాంచైజీ సీఈఓ ధీరజ్ మల్హోత్రా ప్రశంసించారు.
"పాంటింగ్ ఒక స్ఫూర్తిదాయకమైన ఆటగాడు. అతనితో ఉంటే మీరు చాలా ప్రేరేపితమవుతారు. ప్రస్తుతం అతను కోచ్, ప్లేయర్, వ్యాఖ్యాత ఇలా అన్నింటా ప్రతిభ కనబరుస్తున్నాడు. రోజూ అతని ప్రసంగంతోనే ప్రాక్టీసు ప్రారంభమవుతుంది. దాని వల్ల ఆటగాళ్లు మరింత ప్రేరణ పొందడం నేను చూశా. జరిగే ప్రతి ప్రాక్టీసులో అతను కీలక పాత్ర పోషిస్తాడు. అతని శిక్షణలో జట్టు మరో స్థాయికి చేరిందని కచ్చితంగా చెప్పగలను."
-ధీరజ్ మల్హోత్రా, దిల్లీ క్యాపిటల్స్ సీఈఓ
కరోనా వ్యాప్తి సవాళ్ల మధ్య శిక్షణ ఆటగాళ్లకు మంచి అనుభవాన్నిస్తుందని మల్హోత్ర పేర్కొన్నారు. "వారు మైదానంలోకి వచ్చాక ప్రపంచంలో ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఇదంతా ట్రైనింగ్ ప్రభావమే. అందరూ అలానే భావించడం నేను గమనించా. కచ్చితంగా క్రికెట్‌ను మళ్లీ మరో స్థాయిలో చూడబోతున్నాం." అని ధీరజ్ అన్నారు.