ప్రపంచకప్‌లో భారత బౌలింగ్‌లో మరో నాణ్యమైన పేసర్ ఉంటే బాగుండేదని భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడున్న పేసర్లకు మరొకరి మద్దతు లభిస్తే బౌలింగ్ దళం మరింత పటిష్ఠంగా తయారవుతుందని అన్నాడు.
"భారత్ బౌలింగ్‌లో మరో పేసర్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. బుమ్రా, షమీ, భువనేశ్వర్‌కు మరింత మద్దతు అవసరం. హార్దిక్ పాండ్య, విజయ్ శంకర్ రూపంలో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని మీరు అనొచ్చు.. కానీ నేను ఏకీభవించను".
-గౌతమ్ గంభీర్, భారత మాజీ క్రికెటర్
ప్రస్తుతం గంభీర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లో చేరాడు. సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు దిల్లీ లోక్‌సభ నియోజవర్గం నుంచి భాజపా తరపున పోటీ చేశాడు. ముంబయిలో జరిగిన సియెట్ క్రికెట్ రేటింగ్ ఇంటర్నేషనల్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నాడు.
"ఈసారి ప్రపంచకప్ ఫార్మాట్ చాలా బాగుంది. ప్రతి జట్టు మరో జట్టుతో ఆడటం వల్ల మంచి ప్రదర్శన చేసిన టీమ్‌కే ట్రోఫీ లభిస్తుంది. భవిష్యత్ ప్రపంచకప్లనూ ఐసీసీ ఇదే పద్ధతిలో నిర్వహించాలి".
-గంభీర్, భారత మాజీ క్రికెటర్
ప్రపంచకప్‌లో మీరు ఫేవరేట్లుగా భావిస్తున్న జట్లేవి అన్న ప్రశ్నకు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్‌కు ట్రోఫీ గెలిచే సత్తా ఉందని సమాధానం ఇచ్చాడు గంభీర్. టీమిండియా తర్వాత ఆసీస్ అన్ని రకాలుగా పటిష్ఠంగా ఉందని.. న్యూజిలాండ్, ఇంగ్లండ్ కూడా బలమైన జట్లని తెలిపాడు.
ఇప్పటికే రెండు సార్లు ప్రపంచకప్ గెలిచిన ఇండియా తొలిమ్యాచ్‌లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడుతుంది.
ఇవీ చూడండి.. 'అతడి ప్రతిభకు దరిదాపుల్లో ఎవరూ లేరు'