వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టు ఆడేందుకు టీమిండియా అంగీకరించే అవకాశాలున్నాయని ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మొదట్లో తానూ గులాబి బంతి టెస్టులను వ్యతిరేకించానని పేర్కొన్నాడు గిల్లీ. గతేడాది కోహ్లీసేన కంగారూ గడ్డపై పర్యటించినప్పుడు... గులాబి టెస్టు ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిపాదించగా బీసీసీఐ అందుకు నిరాకరించింది.
ముందు వ్యతిరేకించినా...
2020లో టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తుందని, అప్పుడు కచ్చితంగా డే/నైట్ టెస్టు ఉంటుందని గిల్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికి క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అలాంటి ప్రతిపాదన వినలేదని.. కానీ ఓ మ్యాచ్ ఉంటుందనే భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. గులాబి బంతి మ్యాచ్‌ను తొలుత వ్యతిరేకించినప్పటికీ.. ఇప్పుడు టెస్టు క్రికెట్‌కు అవసరమైన సానుకూల ఫలితాలను చూస్తున్నానని చెప్పాడు ఆసీస్ మాజీ కీపర్.
ఆటను బ్రతికించేందుకే...
టెస్టు మ్యాచ్‌కు ఆదరణ తగ్గుతున్న సమయంలో అభిమానులను ఆకట్టుకోడానికి మంచి ప్రయత్నాలు జరగుతున్నాయని అభిప్రాయపడ్డాడు గిల్లీ.
"ఉపఖండంలో డే/నైట్ టెస్టుల్లో మంచు తరహా సమస్యలు ఎదురవుతాయి. ఏ సిరీస్‌లు, ఏ వేదికల్లో ఆడాలో నిర్ణయించేందుకు సమయం పడుతుంది. సాయంకాలం వెలుతురులో ఆడటం కాస్త కష్టమే. అయితే పిచ్‌లపై కవర్లు కప్పకుండా, హెల్మెట్లు లేకుండా ఆడిన రోజులూ ఉన్నాయి. కాలం గడిచేకొద్దీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే ఇప్పుడు ఆటను బతికించేందుకు చేసే ప్రతి ప్రయత్నాన్నీ స్వాగతిస్తున్నా. కొత్తగా ప్రవేశపెట్టిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌తో ప్రతి మ్యాచ్ విలువ, పోటీ పెరిగాయి. టెస్టు క్రికెట్‌ను ఎక్కువగా చూసే రోజులు బహుశా పోయాయనే అనుకున్నా. కానీ భారత్-ఆస్ట్రేలియా, యాషెస్ సిరీస్‌లు ఇప్పటికీ అభిమానులను ఆకర్షిస్తున్నాయి"
-- గిల్‌క్రిస్ట్, ఆసీస్ మాజీ క్రికెటర్
డే/నైట్ మ్యాచ్‌ల వల్ల టెస్టు క్రికెట్ వీక్షకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తోంది బీసీసీఐ. పూర్తిగా పగటిపూట మ్యాచ్‌ల వల్ల ఎండ వేడిమికి తట్టుకోలేక అభిమానులు రావట్లేదని భావించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ... ఈ సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టాడు. అంతేకాకుండా టిక్కెట్టు ధరలను కనిష్ఠంగా రూ.50 నుంచే పెట్టడం వల్ల అందరికీ మ్యాచ్ చూసే అవకాశం లభిస్తుందని దాదా ఇటీవలే అభిప్రాయపడ్డాడు. ఈ నెల 22న ఈడెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో తన తొలి గులాబి బంతి టెస్టు(డే/నైట్) ఆడనుంది టీమిండియా.
ఇదీ చదవండి: ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసిందోచ్..