తాత్కాలిక కెప్టెన్‌గా టీమ్‌ఇండియాను అద్భుతంగా నడిపించి.. ఆస్ట్రేలియాలో 2-1తో టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన రహానె ఎప్పుడూ క్రీడా స్ఫూర్తిని చాటుతూనే ఉంటాడు. ఆ సిరీస్ విజయం తర్వాత స్వదేశం వచ్చిన అతనికి ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కంగారూ బొమ్మ ఉంచిన కేకు కోయడానికి అతను నిరాకరించాడు.
తాజాగా అందుకు గల కారణాన్ని అతను.. వ్యాఖ్యాత హర్షభోగ్లేతో సంభాషణలో భాగంగా వెల్లడించాడు. "కంగారూ.. ఆస్ట్రేలియా జాతీయ జంతువు కాబట్టి ఆ కేకు కోయడానికి నిరాకరించా. ప్రత్యర్థిని గౌరవించాలి. మనం విజయం సాధించినా, చరిత్ర సృష్టించినా ప్రత్యర్థికి మర్యాద ఇవ్వాల్సిందే. వేరే దేశాల పట్ల మనకు గౌరవం ఉండాలి. ఇతర జట్లకు మర్యాదనివ్వాలి. అందుకే ఆ కేకు కోయలేదు" అని రహానె అన్నాడు.
ఇదీ చదవండి: ఆమెతో పరిచయం అలా..: రహానె